విషాదాంత నాటకంలోని ఒక దృశ్యాన్ని చిన్నతనంలో చూసినట్లే చూశారు. అక్షరం తప్పిపోకుండా దరిదాపుగా అందులోని వంక్తులన్నీ జ్ఞప్తికున్నట్లు వాళ్ళు సరిచూచుకున్నారు.
ఆ బంధువులోకెల్లా పెద్దదయిన అంట్ ఛార్లెటీకి, ఆండ్రూ మరీ పసిబిడ్డగా వున్ననాటి విశేషాలు కొన్ని బాగా జ్ఞప్తికున్నాయి. ఆమె "నీవు చాలా ఆశాపరుడైన బిడ్డ" వని అతనితో అన్నది. "నీకు రెండు చెంచాలతో పోయవలసి వచ్చేది. నోటిలోనుంచి ఒకటి తీసేటప్పటికే రెండోదాని కోసం గుక్క పెట్టేవాడివి." ఆండ్రూ అభివృద్ధిని గురించి తెలుసుకోటం విషయంలో ఆమె ఎంతో వెనుకపడింది. అతడు రావటం ఎంతో ముఖ్యవిషయంగా భావించింది. "నీవు ఏ నాటికయినా తిరిగి వచ్చి ఇక్కడ హై స్ట్రీట్లో షాపు పెట్టాలి సుమా!" అన్నది. హై స్ట్రీట్లో ఆమె అల్లుడికి ఒక గ్రీన్ గ్రోసర్ షాపువుంది. అతడు ఇతర వీథుల్లో షాపులున్న వాళ్ళకంటే కొంత అధికుడుగా ఉండేవాడు. ఆమె దృష్టిలో మానవజీవితంలో సాధింపదగ్గ ఘనమైన విషయం ఆ హై స్ట్రీట్లో షాపు పెట్టడమే.
కార్నెగీ కుటుంబం అమెరికాకు వలసపోవటం కోసం ఇరవై పౌనులు అప్పిచ్చిన మిసెస్ హెన్డర్ సన్ - అయి ఫార్టీ ఇంకా జీవించే వుంది. ఆమె, జానీలకు ఇప్పుడు బాగా లేకపోవటమనే స్థితే లేదు. ఇరవై పౌనులు తగ్గటం వల్ల మొదట కొంత తగ్గుదల వచ్చింది. అయితే డన్ఫర్మ్ లైన్ ప్రమాణాలను బట్టి చూస్తే వాళ్ళిప్పుడు ఆనందంగా వున్నారు. అప్పుడిచ్చిన అప్పుకుగాను మిసెస్ హెన్డరసన్కు కార్నెగీ ఇరవై పౌనులు 'ఇంటరెస్టు' (వడ్డీ. ప్రీతి అని శ్లేష) అన్న పేరుతో స్వార్ధరహితమైన కృత్యానికి గాఢమైన కృతజ్ఞతగా కొన్ని సంవత్సరాలు పంపించటంతో, వాళ్ళకు డబ్బు పెరగటం మొదలెట్టింది. ఇప్పుడతడు “నేను ఆ అప్పును ఇప్పుడు తీర్చివేయటం మంచిదని భావిస్తున్నా" నన్నాడు.
“ఆ అప్పు ఇదివరకే తీర్చావుగదా!" అన్నది సమాధానంగా.
"ఇచ్చిన 'ఇంటరెస్టు'తో నేను సంపూర్ణంగా తృప్తి చెందాను" అని అంది.
“వెనక వడ్డీమాత్రమే చెల్లించాను. ఇప్పుడు అసలు ఇచ్చివేయగల స్తోమత నాకు వచ్చింది" అన్నాడు అభ్యంతరం చెపుతూ.
"ఆండ్రా, అసలు సంగతి పెట్టుకోకు" అన్నది, ఆ హాస్యసన్నివేశానికి అనుగుణంగా కళ్ళు మిలమిలలాడిస్తూ. "ఉన్నదున్నట్లుగానే అది చాలా మంచి పెట్టుబడి "
అందువల్ల “ఇంటరెస్టు” క్రింద చెల్లింపులు నడుస్తూనే వచ్చాయి.