Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహోదాత్తంగా శరీరంలో వహించే రక్తంలోని ప్రతిబిందువు లోనూ ఏదో నైచ్యం ఉన్నదన్నమాట!

కాషియస్  : అయితే సిసెరో సంగతేమిటి? వాణ్ణి కూడా మనం కదిలించి చూద్దామా? అతడు మనతో అతిగాఢంగా తుదిదాకా నిలుస్తాడనే నా నమ్మకం.

కాస్కా  : వాణ్ణి మనం వదిలిపెట్టకూడదు.

సిన్నా  : నిజమే. తప్పక వదిలిపెట్టకూడదు!

మెటిల్లస్  : అతడు మనలో తప్పకుండా ఉండితీరాలి. వాడి నెరిసిన జుట్టువల్ల మనకు ప్రజాభిప్రాయం ఎంతో అనుకూలమౌతుంది. మనం చేసే కృత్యాలను కీర్తించే గొంతుకలు దొరుకుతాయి. బుద్ధిబలం వల్ల అతడు ఆలోచించి నిర్ణయించిన దాన్నే మనమంతా ఆచరిస్తున్నామని జనం అనుకుంటారు. మన యౌవనోద్రేకాలు అతని గాంభీర్యమనే కప్పుక్రింద ఒదిగి ఉంటాయి.

బ్రూటస్  : అతడి పేరు చెప్పకండి. మన మహాకార్యాన్ని అతనికి తెలియ జేయకూడదు. అతడు ఎన్నడూ ఇతరులు ఆరంభించినదాన్ని అంగీకరించి అనుసరించే స్వభావం కలవాడు కాడు.

కాషియస్  : అయితే మనం అతణ్ణి వదిలి వేయవలసిందే.

కాస్కా  : అవును. నిజం. వాడు ఇందుకు తగినవాడు కూడా కాడు.

డెషియస్  : సీజర్ ను తప్ప మనం మరి ఇతరులను ఎవరినీ ముట్టుకోకూడదు.

కాషియస్  : సందర్భోచితంగా జ్ఞప్తికి తెచ్చావు. సీజర్ మరణానంతరం అతడికి అతి ప్రియుడైన మార్క్ ఆంటోనీ సజీవుడై ఉండరాదు. ఉంటే అతడు మహామేధావి. మంచి అవకాశాలు కలవాడు. అతడు సమీకరిస్తే మన కెన్నైనా గట్టి చిక్కులు తెచ్చిపెట్టగలడు. అటువంటి పరిస్థితి రాకుండా చేసుకోవటానికి మనం సీజర్ ఆంటోనీలను ఇరువురినీ ఏకకాలంలో తొలగించాలి.

బ్రూటస్  : కైయస్ కాషియస్! ఇలా అయితే మన మార్గం మరింత రక్తోపేతంగా కనిపిస్తుంది. సీజర్కు ఆంటోనీ కేవలం ఒక అవయవం. చంపటంతో కోపం చల్లారుతుంటే ఇంకా ఈర్ష్యతో మోదటమెందుకు! శిరస్సును ఖండించిన తరువాత అవయవాలను చిత్రవధ చేయటమెందుకు?


జూలియస్ సీజర్

61