సూపరింటెండెంటు రాత్రింబవళ్ళూ పనిచేయాలని ఉద్దేశింపబడుతుంది. రాత్రివేళ ఏదైనా ఒక హఠాత్సంభవం జరిగితే అతనికి ఆ రాత్రికి రాత్రే తెలియజేస్తుండేవారు. ప్రదేశానికి వెళ్ళి అతడు దాన్ని చక్కబెట్టి వస్తుండేవాడు.
అంతే కాదు, అది ఎంత గడ్డు చలికాలం! ఆ రోజుల్లో పట్టాలను అడ్డు కమ్మీలమీద బిగించేటప్పుడు పట్టు పట్టటం కోసం పోతయినుము “ఛైర్స్" ఉపయోగించేవాళ్ళు. గట్టి చలి గాలికి అవి తట్టుకోలేక పగుళ్ళు చూపి విచ్చిపోతుండేవి. బండ్లు ఆగిపోవటాలు, పట్టాలు తప్పటాలు ఆ చలికాలంలో పరంపరగా వుంటుండేది. ఒక చిక్కని చలిరాత్రి, ఎక్కడో ఒకచోట, ఇక్కడో అక్కడో, ఆ ఛైర్లు నలభైయేడింటిదాకా బ్రద్దలైనాయి. అలా చలి విజృంభించే ఆ రోజుల్లో, క్రొత్త సూపరింటెండెంటు ఇల్లు విడిచి ఎనిమిది దినాలపాటు తిరిగి భంగాలు కలిగినచోట్ల, బండ్లు పట్టాలు తప్పిన చోట్లు చూచాడు.
తనకు అలుపు లేదు కనుక, తాను ఇతరుల కష్టసుఖాలను ఎరగని కఠినుడైన అధికారివలె ఆ రోజుల్లో ప్రవర్తించానేమో అన్న భావం అతనికి, తరువాతి కాలంలో కలిగింది. తనచుట్టూ ఎంతో రొద వున్నా లెక్కచెయ్యకుండా బాక్స్ కార్ నేలమీద గాని, లేదా మరెక్కడయినా గాని వెన్ను వాల్చి వెంటనే నిద్ర పోగల శక్తి అతనికుంది. ఎంత చిన్న కునికిపాటయినా చాలు, శ్రమతీరి మహోల్లాసంతో నిద్రలేచేవాడు. దీనికి తోడుగా అతనికి హృదయపూర్వకంగా పని చేయాలన్న గుణముంది. క్రొత్తది, బాధ్యతాయుతమైంది అయిన వుద్యోగాన్ని శక్తితో నిర్వహించి చూపించే ఆశయం గల యువకుడు అతడు.
పిట్స్‌బర్గులోని పొగ, పొగదుమ్ము, తిరిగి వచ్చినప్పుడు వాళ్ళను ఆశ్చర్యచకితులను చేశాయి. "ఇది వెనుకటి కంటే చాలా అసహ్యకరమయినది" అని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు - కాని నిజానికి ఇప్పటికంటె వెనకే ఎక్కువ అసహ్యకరంగా వుండేదని కూడా చెప్పవచ్చు. ఏ వస్తువునూ పరిశుభ్రంగా వుంచటం సాధ్యం కాని పని అని మార్గరెట్ కార్నెగీ గృహిణీహృదయం నిరుత్సాహంతో తల్లడిల్లింది.
కార్యాలయంలో ఒకనాడు "మాకు గ్రామసీమలో వుండాలని వుం దన్నాడు.
"మంచిది. ఎందుకుండ కూడదు?" అన్నాడు మిస్టర్ స్కాట్ మేనల్లుడు, రైల్ రోడ్ సంస్థకు జనరల్ ప్రయిట్ ఏజంటు, డి.ఎ. స్టువార్టు. “హోమ్ వుడ్‌కు వచ్చేయ్యండి. వెంటనే కొనవచ్చు. మాకు ప్రక్కనే ఒక స్థలముంది. దాని వునికి ఎంతో బాగుంది. ఏమంత దూరాన కూడా లేదు. ఆ పరిసరాలలో ఒక డజనుకుమించి కుటుంబాలు