ఈ పుటను అచ్చుదిద్దలేదు
అవసరమయిన కొన్ని సాంఘికాచారాలను గురించి నెమ్మది నెమ్మదిగా కొన్ని సలహాలిస్తూ, ఆమె ఆండ్రూకు జ్యేష్ఠభగిని పాత్రను వహిస్తున్నది. కొండలమధ్య ఎంతో దూరం వాళ్ళు వాహ్యాళికి వెళ్తుండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆమె ఆండ్రూను మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి ఆహ్వానిస్తుండేది. అటువంటి ఒక సందర్భంలో రైల్ రోడ్డు వ్యక్తిగా పైకి వస్తున్న టామ్ మిల్లర్ కూడా అతిథి కావటం తటస్థించింది. మిస్టర్ స్కాట్ ఊళ్ళో లేడు. వాళ్ళు భుజించటం కోసం బల్లముందు కూర్చున్న సమయంలో, రెబెక్కా స్టీవార్డు, ఆమె సేవిక అయిన కన్య క్షణకాలం భోజనకక్ష్యలో నుంచి బయటికి వెళ్ళగానే, అప్పుడు తాను అనుభవిస్తున్న జీవితంలోని అద్భుతానికి యింకా అలవాటు పడని ఆండ్రూ, సగౌరవంగా అచటి నవనీతపాత్రను పైకెత్తి, గొణిగినట్లుగా "ఇది నిజమయిన వెండి టామ్! " అన్నాడు.