ఈ సంఘటన జరిగిన కొద్ది కాలం నుంచి ఆపరేటర్లు మధ్యాహ్నభోజనానికి బయటికి వెళ్ళినప్పుడు అండీని ఒంటరిగా కార్యాలయంలో వుంచి పోతుండేవాళ్ళు. అతడు బల్ల దగ్గరవుండి వార్తలను పుచ్చుకోవటమే కాకుండా, పంపిస్తుండేవాడు కూడా. ఇప్పుడు అతని జీతం పెరిగి వారానికి నాలుగు డాలర్లు అయింది. టేపు మీద ఉబ్బెత్తుగా ముద్రింపబడె చుక్కలను, డాషులను చూడకుండానే యంత్రాలు చేసే ధ్వనులనుబట్టి వస్తున్న వార్తలను తెలుసుకోవచ్చునని, అతడు త్వరలోనే గమనించాడు. కేవలం చెవితో వినటంతోనే వార్తలను గ్రహించి కెంటకీలో ఆపరేటరుగా పనిచేస్తున్న ఒక కుర్రవాడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడని, చెప్పుకొంటున్న వార్తలు నిజమని చులకనగా విశ్వసించాడు.
హ్యూస్ అనే వృద్ధుడు టేపునుంచి వార్తలను చదివి, వ్రాసి యిస్తూ కార్యాలయంలో వ్రాయసగాడుగా పనిచేస్తున్నాడు. అతడు, ఆండీ వార్తలను పంపిస్తూ అందుకొంటూ వున్నప్పుడు, గొణగటం ప్రారంభించాడు. ఒక బాలవార్తాహరికి అందించే వార్తలకు తనను ప్రతి వ్రాయమంటున్నందుకు అతడు తన అసంతృప్తిని వెల్లడిస్తున్నాడు. అందువల్ల ఆండీ అతనికి తెలియజెప్పటంకోసం వార్తలు వస్తున్నపుడు టేపుచుట్టను ఆపివేసి, కేవలం అవి చేస్తున్న ధ్వనులను వినటం మూలంగానే వాటిని అందుకోటం ప్రారంభించాడు.
హ్యూసు నింద వచ్చింది. "నీవిలా చేయటానికి వీల్లేదు" అని అతడు అడ్డుపెట్టాడు. "ఇది పద్ధతికా” దన్నాడు.
"జిమ్మీ లియొనార్డు కెంటకీలో ఇలాగే చేస్తున్నా" డని ఒకవంక వార్తను వింటూ, మరొక వంకదాన్ని వ్రాస్తూ ఆండీ ఎదురు చెప్పాడు.
"ఇలా అయితే గందరగోళం జరుగుతుంది" అని ఆ వృద్ధుడు గట్టి పట్టు పట్టాడు. "ఇందుకు నీవు అనుభవించవలసి వస్తుంది.”
అయితే, అతడన్నదానికి బదులుగా ఆండీ చేసిన అద్భుతచర్య అతనికి వుద్యోగంలో ప్రమోషన్ తెచ్చిపెట్టింది. కార్యాలయ వ్యాపారం వేగంగా వృద్ధి పొందుతున్నది. మరొక ఆపరేటరు కావలసివచ్చాడు. ఆండీ ఆ వుద్యోగాన్ని సంపాదించుకొన్నాడు. జీతం నెలకు ఇరవై అయిదు డాలర్లు.
తరువాత కొద్ది కాలానికే మిస్టర్ బ్రూక్స్ ఆండీని బల్లదగ్గరికి పిలిచి అన్నాడు. "గ్రీన్స్బర్లు ఎక్కడుందో నీకు తెలుసా?"