Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. వార్తాహరి బాలుడు

ఆండ్రూ దాన్నిగురించి తరువాతి కాలంలో వెనుదిరిగి చూచుకొన్నప్పుడు, ఆ రోజు అతనికి తన జీవితంలో ఒక మైలురాయిలా, ఒక పరివర్తన బిందువుగా కనిపించింది. చీకటికొట్టులో నుంచీ, కంపుకొట్టే నూనెతొట్టి దగ్గరినుంచీ బయటపడి, ఇప్పుడు అతడు మంచి వెలుగులో, తంతికార్యాలయ కలకలంలో, నగరవీథుల్లో, కర్మాగారాలల్లో, గిడ్డంగుల్లో, స్వేచ్ఛతో సంచరిస్తున్నాడు. ఇంటిదగ్గర ఎప్పుడో గాని తిండి తినటం పడటం లేదు. దాన్ని గురించి కుటుంబంలో వారికి చెప్పటాని కైనా అతనికి అవకాశం దొరకటం లేదు. వెంటనే విధుల అమరికను, వాటిల్లో నడుస్తున్న వ్యాపారాలను, నగరాన్ని గురించినదంతా తెలుసుకోవటానికి అతడు పూనుకున్నాడు. నగరంలోని ప్రముఖులను వ్యాపారస్థులను, వ్యాపార కార్యనిర్వాహకులను, వృత్తినిర్వాహకులను... అందరినీ తెలుసుకున్నాడు. అతని పరిచయస్థులలో తరువాతి కాలంలో అధ్యక్షుడు లింకనక్కు యుద్ధకార్యదర్శి అయిన ఎడ్విన్ యం. స్టాన్టన్ ఒకడు. ఆయనతో పరిచయం కలిగినందుకు అతడు ప్రత్యేకంగా గర్విస్తుండేవాడు.

తంతి కార్యాలయం వారి వ్యాపారం వృద్ధి పొందుతుండటం వల్ల, మరొక కుర్రవాడు అవసరమై ఉండటాన్ని గురించి మిస్టర్ బ్రూక్స్ ఆండ్రూతో మాటాడాడు. "ఆర్యా! నేను ఒకణ్ణి తీసుకురాగల”నని చెప్పి అలిఘనీ నుంచి తన ఇరుగుపొరుగు కుర్రవాడయిన డేవిడ్ మెక్కారోను తీసుకొచ్చాడు. జార్జి మెక్లయిన్ వెళ్ళిపోయినాడు. తరువాత ఆండ్రూ బాటమ్ హూషియర్లలోనుంచి ఒకరి తరువాత ఒకరిని మరి ముగ్గురు కుర్రవాళ్ళను - రాబర్టు పిట్కైరన్, హెన్రీ ఆలివర్, లిల్లీ మోర్లాండ్లను - తెచ్చి ఒప్పజెప్పాడు. వారు వంతుల ప్రకారంగా కార్యాలయంలో వ్యాపారసమయం ప్రారంభం కాకముందే, వూడ్చి బాగుచేయటానికి పెందలకడ వస్తుండేవారు. ఈస్టర్న్ టెలిగ్రాఫ్ కంపెనీ సూపరిండెంటు రైడ్ - ఇతడు కూడా డన్ఫర్మ్ లైన్ వాడే - పర్యవేక్షణకోసం పిట్స్బర్గ్క వచ్చినప్పుడు ఈ స్కాచ్ వార్తాహరి బాలదళాన్ని చూచి ఎంతో సంతోషించి, వారందరికీ ఒకేరకమైన దుస్తులు ఏర్పాటు చేయించాడు. ముదురు పచ్చ జాకెట్లు, బ్రౌజర్లు. ఈ వేషంతో వాళ్ళ నగరంలోని వీథుల్లో వెడుతున్నప్పుడు విశేషంగా జనులదృష్టిని ఆకర్షిస్తుండేవాళ్ళు