Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“ఎలా వ్రాస్తావో చూడనీ, ఇక్కడ కూర్చో" అండీ చేతిలో ఒక కలాన్ని దోపి కాగితాన్ని ముందుకు తోశాడు. "ఆ చెడ్డగా లేదు. చెడ్డగా లేదు" అన్నాడు వ్రాసింది చూస్తూ. “నాకు బిల్లులు వ్రాసిపెట్టటం నీకిష్టమేనా?”

“ఓ, తప్పక చేస్తాను" అని ఆశ్చర్యపడుతూ, తాను పనిచేస్తున్న చీకటి కొట్టులోనుంచి బయటపడటానికి అతడు ఎంత ఆతురత వహిస్తున్నాడో వెల్లడించే ఉత్సాహంతో అన్నాడు.

వెనుకటంత చెడ్డది లేదా అంతకంటే మరీ చెడ్డది అయిన పని తనకు రానున్నదని అతడు అప్పుడు కొంచెమైనా, వూహించలేదు. అతడు మిస్టర్ హో యిచ్చిన "సింగిల్ ఎంట్రీ బుక్ కీపింగ్" పని కొద్దికాలంలోనే పూర్తి చేస్తుండేవాడు. ఇది అతని పనికాలంలో సగానికైనా సరిపోదు. అందువల్ల మిగిలిన రోజంతా అతడు కండెలను నూనె తొట్టిలో ముంచి సరిచేస్తుండేవాడు. ఆ నూనెకు ఎంతో కష్టంమీద గాని అతడు సహించలేనంతటి కంపు వుండేది. మనస్సును బ్రూస్, వాలెస్ ల మీద ఎంతగా లగ్నం చేసినప్పటికీ, ఇతడు దాన్ని సహించలేకపోతున్నాడు. ఓర్చుకోలేక పళ్ళు మెలికలు తిప్పి కొరుకుతుండేవాడు. అయినా తాను బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు ఏ మాత్రం తెలియనిచ్చేవాడు కాదు.

సాయంత్రం అతడు ఒక గంటసేపు ఫిలిప్ చెప్పుల దుకాణం దగ్గర జాన్ ఫిలిప్ ను, యితర బాలురతోను గడుపుతుండేవాడు. వీళ్ళలో ఎక్కువమంది స్కాచ్ బాలురు. ఒకనాటి సాయంత్రం అతడు తన బుక్ కీపింగు పనిని గురించి వాళ్ళకు చెబుతున్నప్పుడు, టామ్ మిల్లర్ "హో వ్యాపారం వంటి చిన్నదానికి సింగిల్ ఎంట్రీ బుక్కీపింగు పనికివస్తే రావచ్చునుగాని, పెద్ద కంపెనీలన్నీ తమ లెక్కలను డబుల్ ఎంట్రీ విధానంలోనే వ్రాయిస్త" వన్నాడు. ఇది ఆండీకి క్రొత్త విషయం. అతడు ఆ క్రొత్త పద్దతిని గురించి యింకా ఎక్కువగా తెలుసుకోదలచుకున్నాడు. అయితే దీన్ని గురించి టామ్కు వున్న జ్ఞానం చాల తక్కువ. కొన్ని సాయంత్రాలు గడిచిన తరువాత ఎవరో ఒక వ్యక్తి క్రమమైన రుసుము తీసుకొని సాయంసమయాలలో ఆ బుక్ కీపింగు విధానాన్ని పాఠం చెపుతాడని టామ్ తెలియజేశాడు. కొన్నాళ్ళు ఆలోచనలు సాగించిన తరువాత అండీ, టామ్, జాన్ ఫిలిప్స్, లిల్లీకౌలీ వాళ్ళకు వచ్చే కొద్ది రాబడులలోనే చిన్న మొత్తాలను ఆ పాఠాలు నేర్చుకునేటందుకు దాచుకుందామని నిశ్చయించారు. అప్పటినుంచి వారు డబుల్ ఎంట్రీలోని విశేషాలను నేర్చుకుంటూ కొన్ని సాయం త్రాలు గడిపారు.