Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకటి అతని చేతిలో ఉంది. ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి శరీరాన్ని చూస్తున్నానని అట్టర్సన్ గమనించాడు. అట్టర్సన్ ధాటిగా అన్నాడు పూల్తో : “మనం రక్షించటానికి గానీ, శిక్షించటానికి గానీ సమయం మించిపోయిన తరువాత వచ్చాం. హైడ్ తను చేసుకున్నదానికి ఫలితంగా అంతరించాడు. ఇక మీ యజమాని కళేబరం ఎక్కడ ఉందో చూడటమే మనకు మిగిలిన పని!" ఆ భవనంలోని విశేషభాగాన్ని, ఇంచుమించు క్రిందభాగాన్నంతటినీ, పరిశోధనశాలే ఆక్రమించుకొని ఉంది. ఇందులోకి వెలుతురు పైనుంచీ, కార్యాలయకక్ష్యలోనుంచీ వస్తూ ఉంటుంది. ఈ పరిశోధనశాల సమస్తభవనానికీ ఒక కోణం. ఏదో ప్రత్యేకంగా ఒక అంతస్తుగా ఉంటుంది. ఈ పరిశోధనశాలకు కార్యాలయకక్ష్యలోనుంచి ఒక సోపానమార్గం కూడా ఉంది. ఇవే కాకుండా ఆ భవనంలో భూగర్భగృహాలూ, అంధకారకక్ష్యలూ ఉన్నవి. వీటన్నిటినీ వారిద్దరూ పరిపూర్ణంగా పరిశోధించారు. ఇవన్నీ బహుకాలంనుంచీ శూన్యంగా ఉండటంవల్లా, ఈ మధ్యకాలంలో పని పడకపోవటం చేత వాటి ద్వారాలు కూడా తెరవకపోవటం వల్లా, వీటిని ఒకమారు పైనుంచి చూస్తేనే చాలు. వీళ్ళు వాటిని తెరిచినప్పుడు ఎన్నాళ్ళనుంచో పైనబడి దట్టంగా పేరుకున్న దుమ్ముపైనుంచి క్రిందికి రాలింది. జెకిల్ విక్రయించుకోకపూర్వం ఆ ఇంటికి యజమానిగా ఉంటున్న శస్త్రవైద్యుని కాలంనుంచీ ఉంటూ ఉన్న విచిత్ర వస్తువులు అధికంగానూ, ఇంకా చెత్త చెదారంతో ఆ కక్ష్యలు నిండి ఉన్నాయి. అక్కడ బహుకాలంనుచీ ప్రవేశాన్ని ఆటంకపరిచేటట్లు ఒక చాపలా సాలీళ్ళు గూళ్ళు దట్టంగా కట్టి ఉన్నాయి. తలుపులు తీయంగానే అవి తెగి క్రింద పడటంతో ఇక ఆ గదిని వెతకటం అనవసరమైన పని అని వెల్లడైంది. ఎక్కడ చూసినా హెన్రీ జెకిల్ సజీవుడుగా గాని, నిర్జీవుడుగా గాని, ఉన్న చిహ్నమేదీ వారికి కన్పించలేదు. పూల్ భవనానికి మధ్యగా ఉన్న నడవగట్టుమీద ఒక తన్ను తన్ని వినిపించిన శబ్దాన్ని విపరీతమైన శ్రద్దతో వింటూ “వారిని ఇక్కడ పాతిపెట్టి ఉండాలి!" అన్నాడు. "లేదా ఆయన పారిపోయి కూడా ఉండవచ్చు" అని అట్టర్సన్ ఉపవీధివంకకు ఉన్న ద్వారాన్ని పరిశీలించాడు. అది తాళం వేసి ఉంది. అంచులమీద త్రుప్పుపట్టిన తాళం చెవి వ్రేలాడుతూ వారి కంటబడ్డది. "ఇది ఉపయోగంలో ఉన్న తాళం చెవిలా కన్పించటం లేదు” అన్నాడు న్యాయవాది అట్టర్సన్. 518 వావిలాల సోమయాజులు సాహిత్యం-3