Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుఃఖాక్రాంతుడై, నిరాశాపూరితుడైన ఖైదీలా అతిభారంగా గాలిని పీలుస్తూ ఉన్న జెకిల్ను అట్టర్సన్ చూచాడు. "ఏమయ్యా జెకిల్! ఇప్పుడు మీకు కొంత కులాసా చిక్కిందనుకొంటాను" అన్నాడు క్రిందినుంచి అట్టర్సన్. “ఎందుకో నేను క్రుంగిపోతున్నాను బాగా క్రుంగిపోతున్నాను. దేవుడికి దయరాలేదు. ఇంకా ఎంతో కాలం ఇలా గడవదు. ” "ఇల్లు వదలకుండా ఇలా బంధించుకొని ఉండటం మీకు ఎక్కువై పోతున్నది. నేనూ, ఎన్ఫీల్డూ ఎలా షికార్లు కొడుతున్నామో చూడండి. ఒంట్లో రక్తప్రసారాన్ని కొట్టి మేల్కొల్పాలి. ఇతడు మా జ్ఞాతి, ఎన్ఫీల్డు - డాక్టర్ జెకిల్ - బయటికి రండి. టోపీ ధరించండి. మాతోపాటు ఒక్కమాటు తిరిగి వచ్చేద్దురుగాని రండి" అన్నాడు న్యాయవాది. జెకిల్ అన్నాడు : "మీరన్నది ఎంతో బాగున్నది. అలా చేయటమంటే నాకెంతో ఇష్టంగూడాను. కానీ కుదరదు కుదరదు. అది నాకు అసాధ్యమైనపని. నాకు ధైర్యం చాలటం లేదు. కానీ, అట్టర్సన్! మిమ్మల్ని చూడగలిగినందుకు నేనెంతో సంతోషి స్తున్నాను. ఇది, నిజం చెపుతున్నాను, నాకెంతో మహానందంగా ఉంది. మిమ్మల్నీ, ఎన్ఫీల్డునూ పైకి ఆహ్వానించేవాణ్ణి. కానీ ఈ ప్రదేశం ఏమీ యోగ్యంగా లేదు. "అయితే శ్రమపడకండి. మేము క్రిందనే ఉండి ఇక్కడినుంచే మీతో మాట్లాడటం మంచిదన్నమాట!" అని అట్టర్సన్ తన సుస్వభావాన్ని వ్యక్తీకరిస్తూ అన్నాడు. “నేనూ ఈ విధంగానే చెయ్యవలసిందని సూచించటానికి సాహసించ బోతున్నాను” అన్నాడు చిరునవ్వుతో డాక్టర్. కానీ అతని మాటలు ముగియకముందే ముఖంలోని చిరునవ్వును త్రోసిరాజని క్రింద నిలుచొని చూస్తున్న ఇద్దరు పెద్దమనుష్యులు రక్తం చల్లబడేటట్లు గాఢభయనిరాశాభావాలు ఆవరించాయి. ఇటువంటి స్థితిలో ఉన్న జెకిల్ను వారు క్షణకాలం మాత్రమే చూడగలిగారు. అతడు ఆ భావాలు కలిగిన మరుక్షణంలోనే కిటికీలు మూసివేయటం ఇందుకు కారణం. కానీ ఆ క్షణకాలదృశ్యం చాలు! ఒక్కమాటైనా మాట్లాడకుండా వారు పెరట్లోనుంచీ బయటికి వచ్చేశారు. మౌనంగానే ఆ ఉపవీథిలో పయనించారు. ఆదివారమైనా మంచి జనసమ్మర్దం ఉండే రాజమార్గానికి వచ్చిన తరువాత, అట్టర్సన్ వెనక్కు తిరిగి తన సహచరుణ్ణి ఎన్ఫీల్డును డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 505