వెంటనే న్యాయవాది "ఈ లేఖవల్ల వాడు పట్టుబడిపోతాడని మీకేమైనా భయముందా?" అని ప్రశ్నించాడు. "లేదు. హైడ్ గతి ఏమౌతుందనే విషయంలో నాకు అణుమాత్రమైనా శ్రద్ధ లేదు. వాణ్ణి నేను సంపూర్ణంగా వదిలేశాను. ఈ అసహ్యమైన వ్యవహారంలో పేరు బయటపడి నా ప్రతిష్ఠకు ఏ భంగం కలుగుతుందో అనే ఆలోచిస్తున్నాను అన్నాడు డాక్టర్ జెకిల్. అట్టర్సన్ కొంతసేపు ఏదో ఆలోచించాడు. తన మిత్రుని స్వార్థపరత్వం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా దానివల్ల అతడికి ఒకింత ఉపశాంతి కూడా చేకూరింది. "మంచిది. నన్నొకమారు ఆ ఉత్తరాన్ని చూడనివ్వండి. అన్నాడు చివరకు. లేఖలో అక్షరాలు విచిత్రమైన ఖత్తులో నిట్రనిలువుగా నడిచాయి. చివరకు 'ఎడ్వర్డు హైడ్' అనే సంతకం కూడా ఉంది. ఈ లేఖను వ్రాసిన వ్యక్తికి డాక్టర్ జెకిల్ అనేక సహస్ర సహాయాలు చేసినట్లూ, అయినా అతడు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించినట్టూ, ఈ ఆపదలోనుంచీ తప్పించుకోటానికి గట్టిగా ఆధారపడ్డ ఉపాయాలు ఎన్నో ఉండటం వల్ల ఆయన అతని జీవితానికి కలగనున్న ముప్పును గురించి ఎటువంటి ఆందోళనా పడనవసరం లేనట్లూ, ఉత్తరానికి తాత్పర్యార్థంగా గోచరించింది. న్యాయవాది ఈ ఉత్తరాన్ని చూచి చాలా సంతోషించాడు. ఈ లేఖవల్ల వ్రాసినవ్యక్తికి డాక్టరుతో ఉన్న స్నేహభావతత్త్వం ఎటువంటిదో అతడు ఆశించిన దానికంటే సుస్పష్టంగా అభివ్యక్తమౌతున్నది. పూర్వం పడుతూ వచ్చిన అపోహలకు న్యాయవాది అట్టర్సన్ తన్ను తానే నిందించుకొన్నాడు. "ఈ లేఖకు సంబంధించిన కవరు కూడా మీ దగ్గరినే ఉంది కదూ?" అని ప్రశ్నించాడు అట్టర్సన్. “పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోటానికి పూర్వమే నేను దాన్ని తగులబెట్టాను. అయితే దానిమీద ఏ పోస్టుముద్రా లేదు. ఆ లేఖను ఎవరో తెచ్చి నా చేతికిచ్చి వెళ్ళారు" అని జెకిల్ దానికి సమాధానం చెప్పాడు. అట్టర్సన్ "అయితే ఈ ఉత్తరాన్ని నా దగ్గర ఉంచుకొని, తలక్రిందపెట్టి నిద్రపొమ్మంటారా?" అన్నాడు. “ఏం చేస్తే మంచిదో నా కోసం మీరే యోచించి నిర్ణయించండి. నాకు ఆత్మవిశ్వాసం తప్పిపోయింది" అన్నాడు జెకిల్. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 493
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/493
స్వరూపం