Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అట్టర్సన్ నన్ను ఆహ్వానించేటప్పుడు కూర్చున్న చోటినుంచి లేవటానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నందువల్ల లేవకుండానే చల్లని హస్తాన్ని చాచి ఆహ్వానించాడు. ఆహ్వానవాక్యాలు చెప్పేటప్పుడు అతని గొంతుకలో ఎంతో మార్పు కూడా కన్పించింది. పూల్ వెళ్ళగానే అట్టర్సన్ "మీరు విషయమంతా విన్నారా?” అన్నాడు. జెకిల్ ఒకమాటు హఠాత్తుగా గతుక్కుమన్నాడు. "అవును. చత్వరంలో పెద్దగా చెప్పుకొంటుంటే నేను భోజనశాల నుంచి విన్నాను" అని డాక్టర్ జెకిల్ సమాధానం చెప్పాడు. న్యాయవాది ప్రస్తావిస్తూ అన్నాడు: “ఒకమాట, 'క్యారూ' నాకు ఖాతాదారు మీరు కూడా అంతే. ఈ వ్యవహారంలో నేను ఏం చెయ్యబోతున్నానో ముందుగా తెలుసుకోవాలి గదా! ఆ దుష్టుణ్ణి దాచిపెట్టాలన్నంత వెర్రితనం మీకు లేదని నేను భావిస్తున్నాను.” "అట్టర్సన్! భగవత్సాక్షిగా చెపుతున్నాను వాణ్ణి నేను మళ్ళీ చూడను. నా గౌరవంమీద ప్రమాణం చేసి చెపుతున్నాను. వాడికీ, నాకూ ఈ ప్రపంచంలో ఇక ఎటువంటి సంబంధమూ లేదు. అదంతా ఐపోయింది. నాకు తెలిసినంతగా మీకు వాడిని గురించి తెలియదు. నా సహాయం వాడికి అక్కరలేదు కూడాను. వాడు భద్రంగా ఉన్నాడు. ఈ నా మాటలు మీరు అతిజాగరూకతతో గమనించండి. ఇక వాడి విషయం మీ చెవినబడదు" అన్నాడు డాక్టర్. వ్యాకులపాటుతో న్యాయవాది ఇదంతా వింటున్నాడు. తన మిత్రుడు ఇంతటి ఉద్వేగంతో సంభాషించటం ఏమీ తృప్తిగా లేదు. "మీకు వాడి విషయం స్పష్టంగా తెలుసునన్నమాట! మీరు చేసినదంతా మీ దృష్టికి సబబుగానే ఉండవచ్చు. ప్రస్తుత విషయం విచారణకు వస్తే మీ పేరు కూడా బయటికి రావచ్చు" అన్నాడతడు. అందుకు డాక్టర్ జెకిల్ ఇలా సమాధానం చెప్పాడు : "వాడి విషయం నాకు స్పష్టంగా తెలుసు. ఈ విషయంలో ఇతరులందరికంటే ఇంత ధైర్యంగా చెప్పటానికి తగిన ఆధారాలు నాకెన్నో ఉన్నవి. కానీ ఒక్క విషయంలో మీరు నాకు సలహా ఇవ్వవలసి ఉంది. నాకొక లేఖ వచ్చింది. ప్రస్తుతం అది నా దగ్గరనే ఉంది. అది నేను పోలీసుశాఖవారికి చూపవచ్చునో లేదో నాకు అర్థం కావటం లేదు. అట్టర్సన్! నేను దాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీరు విశేషప్రజ్ఞావంతులు బాగా ఆలోచించి నిర్ణయించగలరు. అంతే కాదు, మీరంటే నాకు గాఢవిశ్వాసం కూడాను.” 492 వావిలాల సోమయాజులు సాహిత్యం-3