Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమాయకత్వం, పూర్వకాలపు దయాదాక్షిణ్యాలూ ఆ పడుచుకు గోచరించాయి. అంతేకాదు, కొంత గొప్పదనం కూడా ఉట్టిపడి కనిపించింది. అదీకాక అతడు సంపన్నుడని కూడా ఆమెకు స్ఫురించింది. వెంటనే ఆమె కళ్ళు రెండో వ్యక్తి మీదికి మరిలాయి. యజమాని దగ్గిరికి వచ్చినప్పుడు తాను మిక్కిలిగా అసహ్యించుకొన్న మిస్టర్ హైడ్ అని అతన్ని ఆమె వెంటనే పోల్చుకున్నది. అత్యంతాశ్చర్యమగ్నురాలైంది. అతడు చేతిలో ఉన్న గట్టి కర్రను అటూ ఇటూ ఊపుతున్నాడు. పై పెద్దమనిషి అడిగిన ప్రశ్నకు అతడు సమాధాన మేమీ చెప్పినట్లు కన్పించలేదు చెప్పింది ఓర్పు లేనివాడిలాగా విన్నట్లు మాత్రం గోచరించింది. అప్పుడు ఎందుకో అతడికి హఠాత్తుగా కోపోద్రేకం వచ్చింది. నేలను కాలితో తాటించి, చేతిలో ఉన్న కర్రను గిర్రున త్రిప్పి (ఆ కన్య వర్ణించినట్లు) ఉన్మత్తుడిలా ఒక హుంకారం చేశాడు. వృద్ధుడైన ఆ పెద్దమనిషి నిర్ఘాంతపోయి ఒక అడుగు వెనక్కు వేశాడు. అంతట హైడ్ విజృంభించాడు. గట్టి దెబ్బకొట్టి ఆ పెద్దమనిషిని నేలమీద పడేశాడు. మరుక్షణంనుంచీ మర్కటక్రోధంతో క్రిందపడ్డ పెద్దమనిషి మీద కాళ్లు పెట్టి త్రొక్కుతూ, చేతికర్ర దెబ్బలతో కుంభవృష్టి కురిపించాడు. ఆ పెద్దమనిషి ఎముకలు విరిగిన చప్పుడు కూడా ఆ కన్యకు వినిపించింది కళేబరం రోడ్డుమీద ఎగిరిపడ్డది. ఈ దృశ్యధ్వనుల భీకరత్వానికి ఆ కన్య మూర్ఛపోయింది. ఆమెకు స్పృహవచ్చి పోలీసువారికి తెలియజేసేటప్పటికి కల్లా రాత్రి రెండుగంటలైంది. హంతకుడు పారిపోయి ఎంతో సేపైంది. అతని హత్యకు బలి ఐపోయిన వ్యక్తిమాత్రం యమబాధలు పడి ఆ ఉపవీథి మధ్యలో శవరూపంతో పడి ఉన్నాడు. ఈ దారుణకృత్యానికి తోడ్పడ్డ ఆ గట్టికర్ర మిక్కిలి బిరుసైంది గట్టి చేవతో చేసింది. అయినా ఆ క్రూరచర్యలో తనమీద పడ్డ భారానికి మధ్యకు విరిగిపోయింది. అందులో ఒక తుండం ప్రక్క మురికి కాలవలోకి దొర్లి పడి ఉంది. ఇంకోభాగం హంతకుడి చేతిలోనే ఉండిపోవటం వల్ల అతడే తీసుకోపోయి ఉంటాడు. ఇందులో సంశయానికి అవకాశమే లేదు. హతుడైన వ్యక్తి శరీరంమీద ఒక పర్సు, చేతి గడియారం ఉన్నవి. ఒక సీలు వేసిన కవరు తప్ప (బహుశః దీన్ని అతడు పోస్టు చేయటానికి తీసుకువెళ్ళుతుంటాడు) ఇతరమైన కార్డుగానీ, కాగితాలు గానీ అతని దగ్గర ఏమీలేవు. ఆ కవరుమీద మిస్టర్ అట్టర్సన్ విలాసం వ్రాసి ఉంది. మరునాటి ఉదయం అతడు ఇంకా నిద్ర లేవటానికి పూర్వం ఎవరో ఆ కవరును అట్టర్సనక్కు చేర్చారు. అతడు వెంటనే కవరును విప్పి అందులోని పత్రాన్ని అతివేగంగా 486 వావిలాల సోమయాజులు సాహిత్యం-3