Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. డాక్టరు జెకిల్ ప్రశాంతంగా ఉన్నాడు ఒక పక్షం కాలం గడిచింది. డాక్టర్ లాన్యన్, తన చిరకాలమిత్రులు ఐదారుగురికి ఒక ఆనందకరమైన విందు చేశాడు. అతిథులందరూ జ్ఞానవృద్ధులు, కీర్తిమంతులు. ఆసవాలరుచిని అతినిశితంగా పరిగహించి తీర్పులు చెప్పగల సమర్థులు. అట్టర్సన్ అతిథులందరూ రాకముందు కొంతకాలం అక్కడనే ఉండే ఏర్పాటుతో వచ్చాడు. ఇలా ప్రవర్తించటం అతనికి కొత్త విషయం కాదు. అతడు ఇలా ఎన్నోమార్లు చేశాడు. అట్టర్సన్ అంటే అభిమానం ఉన్నవాళ్ళకు అది సాధారణాభిమానం మాత్రం కాదు అతిగాఢాభిమానం, తీవ్రహృదయం లేనివాళ్ళూ, వాచాలురూ విందారగించి విలాసాలలో విశేషభారాన్ని వహించి వెళ్ళిపోయిన తరువాత, సరదాలమీద ఆసక్తి లేని అట్టర్సన్ గోష్ఠి చేయదలచుకొన్న కొందరు మిత్రులు మాత్రమే మిగిలారు. అట్టర్సన్ ఏకాంతప్రియత్వాన్నీ, మితభాషిత్వాన్నీ అర్థంచేసుకొని, అతనితో మాట్లాడి అందువల్ల మనస్సుకు శాంతిని చేకూర్చుకోటం అంటే, వాళ్ళకెంతో ఇష్టం. డాక్టరు జెకిల్ కూడా ఈ కోవలో చేరకుండా ఉండలేనివాళ్ళలో ఒకడు. ఆ విశాలకక్ష్యలో అగ్నిధావనికి ఎదురుగా అతడు కూర్చున్నాడు. వయస్సు ఏబదిఏండ్లు. దృఢశరీరి, మృదువైన భారీముఖం. కొంత ఓరచూపు చూస్తున్నాడా అనిపిస్తుంటుంది. అతనిలో సామర్థ్యం, దాక్షిణ్యం అన్న రెండు గుణాలూ విస్పష్టంగా కనిపిస్తుంటవి. అట్టర్సన్ అంటే గాఢమూ, సత్యమూ అయిన అభిమానం ఉన్నట్లు అతని చూపులే వెల్లడిస్తుంటాయి. "జెకిల్, నేను మీతో మాట్లాడాలెనని ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు వ్రాసిన వీలునామా సంగతి మీకు తెలిసిందేనా?" అన్నాడు అట్టర్సన్. విమర్శనదృష్టితో చూచేవ్యక్తికి ఈ విషయం జెకిల్కు రుచించదని అనిపిస్తుంది. అయితే డాక్టర్ జెకిల్ మాత్రం ఈ ప్రసంగాన్ని ఆనందంతోనే స్వీకరించాడు. "వెర్రివాడా! మిస్టర్ అట్టర్సన్! నాబోటివాడు మీకు క్లైంటు అయినందుకు మీరు చాలా దురదృష్టవంతులు. నా వీలునామాను గురించి మీరు పడుతున్నంత కలవరపాటును పొందేవాళ్ళను నేనెవరినీ చూడనేలేదు. శాస్త్రచర్చల్లో నేను ప్రకటించే డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 481