Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“మీ ముఖాన్ని నన్ను ఒకమాటు పరిశీలించనివ్వండి" అని న్యాయవాది అట్టర్సన్ అర్థించాడు. హైడ్ మొదట ఏదో సంకోచిస్తున్నట్లు కన్పించాడు. తరువాత అతడు హఠాత్తుగా తోచిన భావంవల్లనో అన్నట్లు, తన తిరస్కారాన్ని ప్రకటిస్తున్నట్లుగా అట్టర్సన్ ఎదుట ముఖా ముఖిగా నిలుచున్నాడు. కొన్ని మాత్రల కాలం ఆ వ్యక్తులిద్దరూ ఒకరినొకరు కళ్ళు నిలిపి పరికించి చూచుకొన్నారు. అట్టర్సన్ అన్నాడు: “ఇక నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను. మీతో పరిచయం నాకు ఎందుకైనా మంచిది.” “అవును. మనం ఇప్పుడు కలుసుకోటం వల్ల మంచిపని జరిగింది. నా విలాసం కూడా మీ దగ్గర ఉంటే మంచిది" అని హైడ్ సోహోప్రాంతంలో ఉన్న ఒక ఇంటిసంఖ్య చెప్పాడు. "ఓరి వీడి తస్సదియ్యా! ఇచ్ఛాపత్రం సంగతి వీడి మనస్సులో కూడా ఉంది కాబోలు!" అని అనుకున్నాడు. కానీ తన మనోభావాలను వెలికి రానీయకుండా గుప్తం చేసుకొని విలాసాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతా సూచకంగా ఏదో కొంత గొణిగాడు. "అయితే, మీరు నన్ను ఎలా తెలుసుకున్నారు?" అని అవతల వ్యక్తి ప్రశ్నించాడు. "మిమ్మల్ని గురించి విన్న వర్ణనలవల్ల” అని సమాధానం చెప్పాడు అటర్సన్. “ఎవరు చేసిన వర్ణనల వల్ల?” "మన ఉభయులకూ మిత్రులైన వాళ్ళు ఉన్నారు” అన్నాడు మిస్టర్ అట్టర్సన్. "ఉభయులకూ మిత్రులా? వాళ్ళెవరు?" అని కొంత బొంగురుగా తిరిగి అతడు ప్రశ్నించాడు. “ఉదాహరణానికి జెకిల్" అని సమాధానం చెప్పాడు న్యాయవాది. కోపోల్బణంతో "అతడు మీకెప్పుడూ నన్ను వర్ణించి చెప్పి ఉండడు!" అని, “మీరు అబద్ధమాడుతున్నారని కూడా నేను అనలేను" అన్నాడు అతడు. "అయ్యా! తగ్గండి. మీ భాష సరసంగా లేదు” అన్నాడు మిస్టర్ అట్టర్సన్. రెండోవ్యక్తి ఒక ఆటవికుడిలా పగలబడి నవ్వాడు. మరుక్షణంలోనే ఉద్వేగంతో చెవి తిప్పి తలుపు తెరిచి ఇంట్లోకి అదృశ్యుడైనాడు. 476 వావిలాల సోమయాజులు సాహిత్యం-3