Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఊరికే పొంగి పొర్లి వస్తుండేది. హైడ్ అంటే ఎవరో ఇప్పుడు అతనికి హఠాత్తుగా తెలిసింది. ఇంతకుపూర్వం అతని పేరు తప్ప ఇతర విశేషాలేమీ తెలియవు. అప్పుడే అతనికి కోపం పొర్లి వస్తూ ఉండేటప్పుడు ఇప్పుడు అతడు నీచలక్షణాలు కలవాడని విన్న తరువాత ఇక చెప్ప వలసిందేముంది? ఇంతకుపూర్వం అతన్ని గురించిన భావాలు ఏవేవో మూడమంచులా మనస్సును ఆవరిస్తూ ఉండేది. అతని అవ్యక్త స్వరూపం కంటిని కలవరపెట్టుతూ ఉండేది. ఇప్పుడు ఎన్ఫీల్డ్ చెప్పిన కథ విన్న తరువాత, అతడు తన కంటి ముందు రాక్షసరూపంతో ప్రత్యక్షమైనట్లుంది. "ఇది కేవలం ఒక ఉన్మాదకృత్యం అనుకున్నాను కానీ అత్యవమానకరమైన వ్యవహారమని ఇప్పుడు తోస్తున్నది” అనుకున్నాడు, ప్రమాదకరమైన ఆ పత్రాన్ని తిరిగి ఇనుపపెట్టెలో పెడుతూ. తనలో తాను ఇలా అనుకొన్న తరువాత కొవ్వొత్తిని ఆర్పేసి, పొడుగు పాటికోటు వేసుకొని కావెండిష్ స్క్వేర్ వైపు బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద వైద్యశాల ఉంది. అది అతని మిత్రుడు డాక్టర్ లాన్యన్ ఇల్లు. అక్కడనే ఆ వైద్యుడు గుంపులు గుంపులుగా వచ్చే రోగులకు వైద్యసేవ చేస్తుంటాడు. "ఈ విషయం ఇంకా ఎవరికైనా తెలిసి ఉంటే అది ఒక్క లాన్యనుకు మాత్రమే ఐఉంటుంది" అనుకుంటూ అట్టర్సన్ నడుస్తున్నాడు. లాన్యన్ ఇంటిదగ్గరికి రాగానే, అట్టర్సన్ ను బట్లరు గుర్తు పట్టాడు. లోపలికి ఆహ్వానించాడు. అనవసరమైన కాలహరణం చేయకుండా అతడు వచ్చిన వ్యక్తిని డాక్టరు భోజనశాలలోకి సూటిగా తీసుకోపోయినాడు. ఏకాంతంగా అక్కడ డాక్టరు ఆసవాన్ని సేవిస్తూ ఉన్నాడు. డాక్టర్ లాన్యన్ సహృదయుడు, ఆరోగ్యవంతుడు, చురుకైనవాడు, ఎర్రనిముఖం, తలవెంట్రుకలు మాత్రం ముందుగానే నెరిసినట్లు కనిపిస్తుంటవి. మంచి సరదాగల మనిషి. అతని రీతిలో ఒక విస్పష్టతా, విశిష్టతా గోచరిస్తాయి. అట్టర్సన్ ను చూడగానే అతడు కుర్చీలోనుంచి అమాంతంగా లేచి, రెండుచేతులూ చాచి మహాదరంతో ఆహ్వానించాడు. ఆ డాక్టరు ప్రకటించే ఆదరణను చూసేవాళ్ళకు అది నాటకశాలల్లో కన్పించే నటనవలె గోచరిస్తుంది. కానీ అది నటనకాదు హృదయంలోనుంచి ఉట్టిపడేది. వీళ్ళిద్దరూ చిరకాల స్నేహితులు పాఠశాలలోనూ, కళాశాలలోనూ సహాధ్యాయులు. ఒకరిమీద ఒకరికి గౌరవం విశేషం. ఇందుకుతోడు ఇరువురూ అధికంగా ఆత్మగౌరవం కలవాళ్లు కూడాను. ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు ఇద్దరూ పరిపూర్ణానందాన్ని అనుభవించేవాళ్ళు. డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 471