Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రూటస్  : నీకు నా యెడ అనురాగం అపారం. ఇందులో అణుమాత్రమైనా నాకే అనుమానం లేదు. ఏమీ చేయవలసిందని నీవు నన్ను ప్రేరేపిస్తున్నావో, కాషియస్, అది నాకు కొంతకొంతగా బోధపడుతున్నది. ఈ విషయాన్ని గురించీ, ప్రస్తుత కాలగమనాన్ని గురించీ పూర్వం నేనేమేమి తలపోశానో నీకు తర్వాత తెలియజేస్తాను. నిన్ను ప్రేమ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. దాన్ని ఇప్పుడే వెల్లడించ వలసిందని కోరకు. నీవు సూచించటానికి యత్నించిన నా కర్తవ్యాన్ని గురించి నేను వివేచిస్తాను. ఇంకా నీవేమైనా వినిపించదలచుకుంటే ఓపికతో వింటాను. ఇటువంటి ప్రధానవిషయాలను వినటానికీ, సమాధానాలు చెప్పటానికీ తగ్గసమయాన్ని ఏర్పాటు చేస్తాను. అంతవరకూ ఓ నా పరమమిత్రుడా! ఈ విషయాన్ని గురించి యోచన చేస్తూ ఉండు. కాలం తెచ్చిపెట్టిన ఈ కఠినస్థితిని భరిస్తూ రోము నగరపుత్రుడనే ఖ్యాతిని వహించటం కంటే ఈ బ్రూటస్ పల్లీయుడని అనిపించుకోవటానికైనా ఇష్టపడతాడు.

కాషియస్  : సంతోషం! శక్తిహీనాలైన నా మాటలు బ్రూటస్ మహాశయుని ముఖంనుంచి ఇంతటి అగ్నిజ్వాలలను వెలికిచిమ్మించ గలిగినందుకు సంతోషం.

బ్రూటస్  : క్రీడలన్నీ ఐపోయినట్లున్నయ్. సీజర్ తిరిగి వచ్చేస్తున్నాడు.

కాషియస్  : వారీమార్గాన వెళ్ళేటప్పుడు కాస్కాను టోగా కొనపట్టి పిలవండి. మనం గమనించవలసిన విశేషాలు ఈ నాడు అక్కడ ఏమి జరిగాయో దాపరికం లేకుండా చెప్పేస్తాడు.

(సీజర్, అతని పరివారం తిరిగి ప్రవేశిస్తారు.)

బ్రూటస్ : అలాగే చేస్తాను. గమనించు, కాషియస్! సీజర్ ముఖం మీద ఏవో కోపరేఖలు కనిపిస్తున్నట్లున్నాయి? మిగిలిన పరివారమంతా గట్టిగా తిట్లు తిన్నట్లున్నారు? కల్పూర్నియా చుబుకం పాలిపోయినట్లు తోచటం లేదూ? సభాభవనంలో సభ్యులు తన్ను వ్యతిరేకించినప్పుడు కనిపించే ధోరణిలో సిసిరో రక్తారుణనేత్రాలతో ద్యోతకమౌతున్నాడు కదూ?

కాషియస్  : కాస్కా వచ్చి విశేషమేమి జరిగిందో వినిపిస్తాడుగా.

సీజర్  : ఆంటోనియస్!

ఆంటోని  : సీజర్!


జూలియస్ సీజర్

45