Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుగుణపరితాపాన్ని వహిస్తున్నదో అన్నట్లు దాని ప్రతిధ్వనుల రూపాన వినిపించే నూతన దుఃఖధ్వనులు ప్రతిదినం తెల్లవారిందంటే క్రొత్తక్రొత్తవిగా వినిపిస్తుంటాయి. మాల్కొం : నాకు సంబంధించినంతవరకూ నేను విశ్వసించినవాటికోసమే దుఃఖిస్తాను. సత్యాలని రూఢిగా ఎరిగినవాటినే విశ్వసిస్తాను. కాలం అనుకూలించి సాయపడ్డప్పుడు అట్టి కృత్యాలకు తగ్గ ప్రతీకారచర్యలు చేస్తాను. నీవు చెప్పేవి సత్యాలే కావచ్చు. ఎవరి నామోచ్చారణం ఇప్పుడు మన నాల్కను రగుల్కొల్పుతున్నదో ఆ నిరంకుశుణ్ణి అందరూ పూర్వం ఉదాత్తుడని భావించారు. అతణ్ణి నీవూ పూర్వం గాఢంగా ప్రేమించావు. ఇంతవరకూ అతడు నిన్ను ముట్టుకోలేదు. అతడివల్ల మంచి పారితోషికాలను పొందటానికి నీకు మంచి వీలుంది. క్రోధాన్ని వహించిన దేవతను తృప్తిపరచటానికి శక్తిహీనం, దరిద్రం, నిరపరాధం అయిన అజశాబకాన్ని బలిగా అర్పించటం అతివివేకమైన విధానం కదా! మాక్డఫ్ : నేను స్వామిద్రోహిని కాను! మాల్కొం : నీవు కాకపోవచ్చు. కానీ మేక్బెత్ విశ్వాసఘాతుకుడు. రాజాజ్ఞను నిర్వహించే విషయంలో ఉదాత్తమూ, సద్గుణాన్వితమూ అయిన ప్రకృతికూడా లొంగిపోవచ్చు. ఇలా నిన్ను అనుమానించినందుకు క్షమాపణ నర్థిస్తున్నాను. అయితే నీ సహజప్రకృతి నా అభిప్రాయాలను మార్చలేదు గదా! అతితేజోవంతులైనవారు పడిపోయిన వేళల్లో కూడా తేజోవంతులుగానే ప్రకాశిస్తుంటారు. నీచగుణాలకు సద్గుణవేషాన్ని కల్పించి కన్పించినా సద్గుణం సర్వవేళలా స్వస్వరూపంతోనే కన్పించితీరాలి. మాక్డఫ్ : నా ఆశలన్నీ భగ్నమైనాయి. మాల్కొం : ఇలా జరగటం బహుశః నేను అనుమానించటం వల్లనే అని అనుకొంటాను. ఆలోచనారహితమైన తొందరలో అమూల్య హేతువులు, ప్రగాఢప్రణయబంధాలు అయిన దారాపుత్రులను రక్షణరహితులనుగా చేసి, వీడ్కోలైనా చెప్పకుండా నీవెందుకు విచ్చేశావు? నిన్ను అనుమానించటం అగౌరవించటం కాదనీ, నా భద్రత కోసం తీసుకొంటున్న చర్య అనీ భావించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేనెల్లా భావించినా దానికి భిన్నంగా నీవు సత్యతత్పరుడవే ఐ ఉండవచ్చు. మాక్డర్: అయ్యో! ఓ నా అభాగ్యజన్మభూమీ! నీ శరీరంనుంచి ఇలాగే అవిరళంగా రక్తం స్రవించుగాక! ఓ స్వామిద్రోహమా! మంచితనం నిన్ను అడ్డుకోలేకపోతున్నది 425