Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాస్ : ప్రభ్వీ! తాము ప్రశాంతితో వ్యవహరించాలి. మాక్డఫ్ ప్రభ్వి : వారు ప్రశాంతితో వ్యవహరించారా మరి? వారు పారిపోవటం కేవలం ఉన్మాదకృత్యం. ఒకప్పుడు మన చేష్టలవల్ల కాకపోయినా భయాలు మనకు రాజద్రోహులను చేస్తుంటాయి. రాస్ : తల్లీ! వారు చేసిన కృత్యం వివేకంతో చేసిందో, భయంవల్ల చేసిందో మీకు తెలియదు. మాక్డఫ్ ప్రభ్వి : వివేకంతో చేసిందనా? భార్యను, బిడ్డలను, సౌధాలను, ఇతరాలైన ఆస్తిపాస్తులను ఎక్కడనుంచి తాము పారిపోతున్నారో ఆ ప్రదేశంలోనే విడిచిపుచ్చటం వివేకంతో చేసిన పనా? వారికి మేమంటే ప్రేమ లేదు. సహజమైన ప్రణయభావం వారిలో లోపించింది. జీనువాయివంటి చిన్న పిట్టకూడా గూటిలోని తన చిన్నబిడ్డలను రక్షించుకోటం కోసం గ్రుడ్లగూబతో పోరాడుతుంది. ఇదంతా వారికోసమైన భయమేగాని, ఇతరులకోసమైన ప్రేమమాత్రం కాదు. ఏ రీతిగా చూసినా ఈ పారిపోవటానికి అర్థం కనిపించటం లేదు కనక ఇందులో వివేకం అణుమాత్రం లేదు. రాస్ : ప్రియసోదరీ! ఈ తొందరపాటును కొంతకట్టిపెట్టమని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. మీ భర్త ఉదాత్తుడు, వివేకి, ధర్మసమ్మితుడు కాలంలోని వైపరీత్యాలను మహాఘనంగా గమనింపగలవాడు. సత్యానికి ఏమీ ఎరగకపోయినా, మనం రాజద్రోహులముగా పరిగణింబడుతున్నామంటే మనయెడ పుట్టిన ప్రతివదంతినీ మన భయానికి అనుగుణంగా అన్వయించుకొంటూ, అవగతం చేసుకొంటూ, ఎందుకు మనం భయపడవలసివచ్చిందో కూడా తెలియకుండానే భయదవాతోత్తుంగ పారావారంలో ఆటుపోటులమధ్య అరిగిపోతున్నప్పుడు, కాలం మనయెడ నిర్దాక్షిణ్యంగా వర్తిస్తున్నదని మాత్రమే చెప్పగలను. ఇప్పుడు మీ సెలవు తీసుకొంటున్నాను. తిరిగి ఇక్కడికి రావటానికి ఎంతో ఆలస్యం చెయ్యను. విషయాలు విషమపరిస్థితిలో పరాకాష్ఠను చేరుకోటంవల్ల అంతరించనన్నా అంతరిస్తవి. లేదా పూర్వం తామున్న ప్రశాంతసుస్థితినైనా పొందుతవి. ప్రియసోదరీ! పరమేశ్వరుడు మీకు పరమశ్రేయాలను చేకూర్చుగాక! మాక్డఫ్ ప్రభ్వి : ఇతడు తండ్రి కలవాడే. అయినా ఇప్పుడు లేనివాడైనాడు. 421