Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 మేక్బెత్ : నీవు విశేషంగా బాంకో ప్రేతరూపంలో కనిపిస్తున్నావు. వెళ్ళిపో! నీ శిరస్సుమీది కిరీటం నా కనుగ్రుడ్లను మండిస్తున్నది. స్వర్ణకిరీటాన్ని ధరించిన ఓ ద్వితీయమూర్తీ! నీ జుట్టు మొదటివాని జుత్తులాగానే ఉంది. మూడోరూపం సర్వవిధాలా మొదటి రెండు రూపాలనే పోలివుంది. నాల్గోరూపం కూడా ఉందా ఏమిటి? ఓ నేత్రాల్లారా! మీరు నిలిచిన స్థానం నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి. ఏమిటి ఈ రాజవంశపరంపర ఇలా మహాప్రళయకాలంవరకూ అనంతంగా కొనసాగిపోతుందా ఏమిటి? మళ్ళీ ఇంకో రూపమా సప్తమరూపమా! ఇక ససేమిరా నేను చూడను. ఇంకా ఎన్నెన్నో మూర్తులను ప్రదర్శించే కాచముకురాన్ని ధరించి ఎనిమిదోరూపం కనిపిస్తున్నదే! ఇందులో కొన్ని రూపాలు ఒకచేతిలో రెండు బంతులను, మరో చేతిలో మూడు రాజదండాలను ధరించి కనిపిస్తున్నవే. అయ్యో! ఎంత ఘోరమైన దృశ్యం! 'వీరంతా నా వంశజులే' అని ఛాయామూర్తులను చూపిస్తూ నన్ను చూసి నవ్వుతూ, రక్తంతో తడిసి బిరుసెక్కి జడలు కట్టిన జుత్తులో బాంకో వీరందరి వెనుకా కనిపించటంవల్ల నా భయాలన్నీ సత్యమైనవే అని నాకిప్పుడర్థమౌతున్నది. ఏమిటి? ఇలా ముందు ముందు అంతా జరిగి తీరుతుందా? ప్రథమ మాంత్రికురాలు : అవునయ్యా! జరిగితీరుతుంది. అయితే మేక్బెత్ ఇంతగా అచ్చెరువుపడి ఆగిపోయాడేమిటి? రండి! సోదరీమణులారా! మనం ఇతనికి ఉత్సాహాన్ని కల్పిద్దాము. అతడు మనకిచ్చిన స్వాగతానికి తగ్గరీతిగా శ్రద్ధతో మనం మన కర్తవ్యాలను నిర్వహించామని ఈ దొడ్డరాజు పలికేటట్టుగా, అతనికోసం మనకు తెలిసినవాటిలో మంచి వినోదాన్నొకదానిని కల్పిద్దాము. సంగీతాన్ని వినిపించేటట్లు నేను వాయువుమీద ఒక మంత్రప్రయోగం చేస్తాను. నీవు విచిత్రమైన మండలనృత్యం చెయ్యి. (సంగీతం వినిపిస్తుంది. మాంత్రికురాండ్రు నృత్యం చేసి హెకేట్తోబాటు అదృశ్యమౌతారు.) మేక్బెత్ : వీళ్ళేరి? అదృశ్యమైపోయినారా? ఈ దుష్టమైన ఘడియ నిందాపాత్రమౌతూ కాలపట్టికలో నిలిచిపోవుగాక! అక్కడ వేచిఉన్నదెవరో లోపలికి రండి! లెన్నాక్స్: మహారాజా! ఏమాజ్ఞ! లెన్నాక్స్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నీవు మాంత్రికురాండ్రను చూశావా? 419