శకునజ్ఞుడు : మార్చి పదిహేనో నాడు జాగ్రత్త!
సీజర్ : ఇతడెవరో స్వాప్నికుడు. అతణ్ణి వదిలెయ్యండి. పోదాం కదలండి.
ఒక తుత్తారధ్వని వినిపిస్తుంది. బ్రూటస్, కాషియస్ తప్ప మిగిలిన వారందరూ నిష్క్రమిస్తారు.
కాషియస్ : మీరు వెళ్ళి 'ఆ పవిత్రధావనాన్ని' తిలకిస్తారా?
బ్రూటస్ : లేదు.
కాషియస్ : వెళ్ళి చూడవలసిందని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
బ్రూటస్ : క్రీడలంటే నాకిష్టం లేదు. ఆంటోనీలో ఉన్న ఉద్వేగం నాలో లేదు. నీ కోరికలకు నేనేం ఆటంక పడనులే. నిన్ను వదలిపెట్టి వెళ్ళిపోతాను.
కాషియస్ : బ్రూటస్! కొంతకాలంనుంచీ మీ కళ్ళలో నాకు వెనకటి ఆప్యాయత ఎందుకోగాని కనిపించటం లేదు. మిమ్మల్ని మనసార ప్రేమించే మిత్రుడిమీద ఎందుకంత వినూత్నంగానూ, కఠినంగానూ ఉంటున్నారు?
బ్రూటస్ : కాషియస్, మోసపోకు. నీకు అపరిచితమైన భావంతో నా ముఖం కప్పుకోపోయి ఉంటే ఆ బాధంతా కేవలం నాకోసమే. ఇతరులకు ఎట్టి సంబంధమూ లేని విషయాల వల్ల నాలో పరస్పర విరుద్ధోద్వేగాలు కలిగి నన్ను అలయించాయి. ఇదే బహుశః నా విచిత్రప్రవర్తనకు మూలకారణమై ఉంటుంది. అందువల్ల నాలో ద్యోతకమయ్యే మార్పునకు నా ముఖ్యస్నేహితులు చింతపడరనుకుంటాను. వెర్రి బ్రూటస్, తన అంతరాత్మలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల, ఇతరుల ఎడ చూపవలసిన ప్రేమాభిమానాలను ప్రకటించటం కూడా మరిచిపోతున్నాడని అనుకుంటారు గాని, అంతకుమించి ఏమీ ఆలోచించరనుకుంటాను. నా ఆప్తమిత్రుల్లో నీవూ ఒకడివి.
కాషియస్ : బ్రూటస్! అయితే మీ మానసికోద్వేగాన్ని అపార్థం చేసుకున్నా నన్నమాట! తర్కించవలసిన అభిప్రాయాలను ఎన్నిటినో ఇన్నాళ్ళబట్టీ నా మనస్సులోనే దాచి ఉంచాను. మిమ్మల్ని గురించి మీకు బాగా తెలుసా బ్రూటస్?
బ్రూటస్ : లేదు, కాషియస్! అద్దంలో ప్రతిబింబాన్ని తిలకించటం వల్లనో లేదా మరోరీతిగానో తప్ప కన్ను తన్ను తాను చూచుకోగలుగుతుందా?
జూలియస్ సీజర్
41