Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేక్బెత్ : ప్రియా! నిర్వర్తితమైన తరువాత పరికించి శ్లాఘించేటంతవరకూ ముందుగానే దానిని గూర్చిన, విశేషాలను నీవు తెలుసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. డేగలను పెంచి వేటాడేవాడు వాటికన్నులను కుట్టేటట్టుగా జాలిగొల్పేటట్లు పగటికన్నులను కుట్టివేసే కాళరాత్రీ! రా! దారుణమైన నీ గుప్తహస్తంతో నిరంతరం నన్ను భయంవల్ల పాలిపొయ్యేటట్లు ఆ బిరుదాన్ని తుడిచిపెట్టి ఖండఖండాలుగా తుంచి వెయ్యి! చీకటి దట్టమౌతున్నది. అదిగో, కాకం! స్వకులనీడనిబిడమైన కాననానికి వెళ్ళిపోతున్నది. దినకాంతిలో తిరిగే సరసమైన ప్రాణిలోకం అలసి నిద్రకోసం ఆతురత వహిస్తున్నది. రాత్రికి ప్రతినిధులైన క్రూరసత్వాలు తమ ఎరలను వేటాడటం కోసం మేల్కొంటున్నవి. నా మాటలకు నీవు ఆశ్చర్యపడు తున్నట్లున్నావు? కొంతసేపు ఓపికపట్టు, దౌష్ట్యంతో ఆరంభించిన పనులకు క్రౌర్యంతోనే భద్రత చేకూరవలసివుంది. నన్ననుసరించు! (నిష్క్రమిస్తారు) మూడో దృశ్యం దుర్గప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక ఉద్యానవనం. ముగ్గురు హంతకులు ప్రవేశిస్తారు. మొదటి హంతకుడు : మమ్మల్ని కలుసుకోమని నిన్నెవ్వరాజ్ఞాపించారు? మూడో హంతకుడు : మేక్బెత్. రెండో హంతకుడు : 'మీరు చేయవలసిన పను' అని ఇతడు చెప్పే పనులన్నీ మొదట మనం స్వయంగా పొందిన సూచనలకు సరిపోతున్నవి. కనుక ఇతణ్ణి మనం అనుమానించవలసిన అవసరం లేదు. మొదటి హంతకుడు : అయితే ఇక మాతోపాటు ఉండిపో. పడమటిదిక్కున పగటి వెలుగులింకా మసకమసకగా కన్పిస్తూనేవున్నవి. ప్రయాణంలో ఆలస్యమైన బాటసారి దగ్గరిలో ఉన్న పాంథశాలను చేరుకోటానికని అశ్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. మనం ఎవరికోసం కాచుకొంటున్నామో ఆ వ్యక్తి కూడా సమీపిస్తుంటాడు. 402 వావిలాల సోమయాజులు సాహిత్యం-3