Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాల్కొం : హంతకుని ధనువునుంచి విడువబడ్డ దారుణబాణ మింకా దాని చరమలక్ష్యాన్ని చేరుకోలేదు. ఆ లక్ష్యపథాన్ని విడిచిపెడుతూ తప్పుకొని చరించటమే మనకు క్షేమకరమైన మార్గం. అందువల్ల మనం అశ్వాలను అధిరోహిద్దాం. సెలవు తీసుకోవాలన్న ప్రత్యేకశ్రద్ధ ఏమీ పెట్టుకోవద్దు. వేగంగా వెళ్ళిపోదాం. చోరుల్లా కేవలం మన శరీరాలతోనే జారుకొందాము. తమ భద్రత అన్నదే వారికి ఏకైకకాంక్ష అయినప్పుడు, చోరులు తమ శరీరాలను తామే కాజేసుకోపోవటం ధర్మం కదా! (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం రాస్, ఒక వృద్ధుడు ప్రవేశిస్తారు. వృద్ధుడు : గడచిన నా డెబ్బది సంవత్సరాల జీవితం జ్ఞప్తికుంది. విపులమైన ఈ కాలంలో భయంకరాలు, విచిత్రాలు అయిన సంఘటనలు జరిగిన ఎన్నో సమయాలను నేనెరుగుదును. కానీ ఈ భీకరమైన కాళరాత్రి నా పూర్వానుభవాల నన్నిటినీ అతిశయించింది. రాస్ : ప్రపంచఘాతుకరంగస్థలంమీద మానవుడు అభినయిస్తున్న పాత్రను చూచి కోపాన్ని వహించి అకసం దాన్ని నాశనం చేస్తానని భయపెట్టటం నీవు చూచావు కదా! గడియారం వల్ల ఇది పగలని తెలుస్తున్నది. కానీ పయనించే దీపమైన సూర్యుణ్ణి కారుమొయిళ్ళు కప్పివేయటం వల్ల కాళరాత్రిలా కన్పిస్తున్నది. జీవితప్రదానం చేసే సూర్యరశ్మిని చుంబించవలసిన ఈ సమయంలో పృథ్వీముఖాన్ని గాఢాంధకారం క్రమ్మివేసింది. వృద్ధుడు : జరిగిపోయిన కృత్యంలా ఇదీ ఎంతో అసహజమైంది. గడచిన బుధవారంనాడు అది ఎంత ఎత్తున ఎగురకలదో అంత ఎత్తూ ఎగిరి విహరిస్తున్న ఒక శ్యేనాన్ని, సామాన్యంగా మూషికాలను తిని బ్రతికే ఒక ఉలూకం వెంటబడి తరిమికొట్టింది. రాస్ : మరో విచిత్రమైన విషయం జరిగింది. మనోజ్ఞలు, త్వరితగమనాలు అయిన డంకన్ అశ్వరాజాలు, తమ జాతిలో కల్లా అత్యుత్తమాలు, హఠాత్తుగా స్వభావం మారటం చేత మందురానుంచి తప్పించుకొని విడివడి పాలకులను లక్ష్యపెట్టకుండా మానవజాతిమీద యుద్ధాన్ని ప్రకటించగోరుతున్నట్లు ప్రవర్తించాయి. 392 వావిలాల సోమయాజులు సాహిత్యం-3