మేక్బెత్ ప్రభ్వి : ప్రక్క కక్ష్యలో ఇరువురు నిద్రిస్తున్నారు. మీరు చెప్పినదంతా అక్కడే జరగటానికి అవకాశముంది. మేక్బెత్ : అందులో ఒకడు 'భగవంతుడు రక్షించుగాక!' అని అన్నాడు. రెండోవాడు 'అగుగాక!' అన్నాడు. ఈ హంతకహస్తాలతో ఉన్న నన్ను చూసి వారు భయపడి నట్లున్నారు. 'భగవంతుడు రక్షించుగాక!' అని వారన్నప్పుడు నేను 'అగుగాక!' అని అనలేకపోయినాను. మేక్బెత్ ప్రభ్వి : మీరు ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచించవద్దు. మేక్బెత్ : అయితే నేనప్పుడు 'అగుగాక!' అని ఎందుకు అనలేకపోయినాను? ఆ సమయంలో పరమేశ్వరానుగ్రహం నాకెంతైనా కావలసివుంది. కానీ నా గొంతుకలో 'అగుగాక!' అన్నమాటలు తట్టాడి కొట్టుకులాడాయి కూడాను. మేక్బెత్ ప్రభ్వి : ఈ విషయాలనుగురించి ఈ రీతి ఇంత తీవ్రంగా ఆలోచించరాదు. ఆలోచిస్తే అవి మనలను వెర్రివాళ్ళను చేసివేస్తాయి. మేక్బెత్ : 'నిద్రించకు. మేక్బెత్ నిద్రను హత్య చేశాడు!' అని ఏదో ఒక గొంతుక కేక పెట్టినట్లు నాకు వినిపించింది. నిద్ర! అమాయకపు నిద్ర!! శ్రద్ధ అనే చిక్కుముళ్ళు పడ్డ చీనిపింజలను సవరించి వస్త్రరూపాన బంధించే నిద్ర!! అనుదిన మృత్యువైన నిద్ర!! అది అలసిన శ్రమకు స్నానం! గాయపడిన మనస్సుకు కమనీయమైన అంజనం!! ఉదాత్తమైన ప్రకృతి చేసే విందులో ద్వితీయ వ్యంజన ప్రసారం!!" జీవితపు విందులో ప్రబలమైన బలవర్ధకం!! మేక్బెత్ ప్రభ్వి : ఈ ధోరణేమిటి? మేక్బెత్ : 'ఇక నిద్రపోవద్దు. గ్లామిస్ నిద్రనే హత్య చేశాడు. కౌడర్ ఇక నిద్రపోడు!' అని ఆ గొంతుక గృహమంతా ప్రతిధ్వనించేటట్లు కేకలు పెట్టి పలికింది. మేక్బెత్ ప్రభ్వి : ఇలా కేకలు పెట్టింది ఎవరు? ఉదాత్త థేన్ మహాశయా! వృథాగా ఈ విషయాలను గురించి మతికేదో మహావ్యాధి సంక్రమించినట్లు తలపోస్తూ, మీ సర్వశక్తినీ దిగజార్చుకొంటున్నారు. వెళ్ళండి. నీరు తెచ్చుకొని చేసిన హత్యకు నీచసాక్ష్యంగా కన్పించే ఈ నీలరక్తపంకాన్ని మీ చేతులమీద నుంచి కడిగివేయండి. ఆ ఛురికల నిక్కడి కెందుకు తెచ్చారు? అవి అక్కడనే ఉండాలి. తీసుకువెళ్ళండి. నిద్రిస్తున్న ఆ సేవకుల శరీరాలను రక్తంతో పులిమిపెట్టండి. 384 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/384
స్వరూపం