ద్వితీయాంకం ఒకటో దృశ్యం ఇన్వర్నిస్లో మేక్బెత్ సౌధంలోని ఒక ప్రాంగణం. కాగడాను ముందుకు చూపుతున్న ఫ్లియాన్సుతో బాంకో ప్రవేశిస్తాడు. బాంకో: ఇప్పుడు సమయమెంతై వుంటుంది? ఫ్లియాన్సు : చంద్రాస్తమయమైంది. ఎన్ని గంటలు కొట్టారో వినలేదు. బాంకో : అది పన్నెండుగంటలకే జరిగిపోతుంది. ఫ్లియాన్సు : సరి, ఈ ఖడ్గాన్ని పుచ్చుకో. ఆకాశం తన దీపికలను ఆర్పివేసి సౌఖ్యాన్ని ప్రకటించింది. (ఛురిక నందిస్తూ) దీన్ని కూడా పుచ్చుకో. సీసంలా బరువైన నిద్ర నన్నాహ్వానిస్తున్నది. కానీ నాకు నిద్రపోవాలని లేదు. నిద్రావేళ కలల్లో కూడా దయాన్వితాలైన దివ్యశక్తులు పాపపుటూహలనుంచి నన్ను దూరంచేయుగాక! ఏదీ, నా ఖడ్గాన్ని ఇలాతే. ఎవరక్కడ? మేక్బెత్, కరదీపికతో ఒక సేవకుడు ప్రవేశిస్తారు. మేక్బెత్ : ఒక మిత్రుడు. బాంకో: ఏమిటి? ఇంకా మీరు విశ్రాంతి తీసుకోలేదా? ఆయన అసామాన్యమైన ఆనందాన్ని అనుభవించి పారితోషికాలుగా బహుళమైన కాన్కలను మీ సేవకాలయాలకు పంపించాడు. “మహాదయాన్వితయైన, అతిథేయి" అన్న బిరుదంతో ఈ అనర్హమణిని మీ పత్నికి బహుమతిగా ఇచ్చి ఎంతో అభినందించాడు. ఆయన శయనించి ఎంతో సేపైంది.
మేక్బెత్ : కాలమతిస్వల్పం కావటంవల్ల తగిన ప్రయత్నాలు చేయలేకపోవటం జరిగి, వారి ఆగమనానికి తగ్గ ఆతిథ్యాన్ని ఇవ్వాలన్న మా అభిలాష లోపరహితంగా తీరింది కాదు. బాంకో : సర్వం సక్రమంగానే సాగిపోయింది. రాత్రి నేనా మువ్వురు మాంత్రికురాండ్రను గురించి కలగన్నాను. మీ విషయంలో వారు చెప్పింది కొంత సత్యమైంది. 380 వావిలాల సోమయాజులు సాహిత్యం-3