ఈ సౌధంలోని వలభుల్లోగాని, ఫలకపంక్తుల్లోగాని, అండకుడ్యాలలోగాని, అవి గూళ్ళు కట్టి తమ పిల్లలను పెట్టని ప్రదేశమంటూ లేదు. నేను ఎన్నోమార్లు పరిశీలించాను అవి ఎక్కడ సంతానంతో సంతోషంగా తిరుగుతుంటవో అక్కడ వాయువు అతికోమలంగా ఉంటుంది. మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది డంకన్ : అదిగో గమనించండి! గౌరవనీయురాలైన మన అతిథేయి విచ్చేస్తున్నది. మిత్రబృందంతో సమావేశాన్ని కాంక్షించి త్వరపెట్టే మన ప్రేమ కొన్ని సందర్భాలలో వారికీ శ్రమను కల్పిస్తుంటుంది. అయినా మనం వారి ప్రేమను స్వీకరించి కృతజ్ఞతలర్పిస్తుంటాము. మా రాకవల్ల మీకు మేము కల్పించిన శ్రమకు తగ్గ బహూకృతిని ప్రసాదించవలసిందని భగవంతుని ప్రార్థించే రీతిని, కల్పించిన శ్రమకుగాను మాకు కృతజ్ఞతను తెల్పవలసిన రీతిని ఈ ఆగమనం వల్ల మీకు మేము నేర్పుతున్నాము. మేక్బెత్ ప్రభ్వి : మేము చేయగలిగిన సర్వసేవలను రెండుమార్లుగా చేసి, వాటినన్నిటినీ తిరిగి రెండురెట్లుగా చేసినా, ఇలా గౌరవవిశేషంతో మా గృహాన్ని ముంచెత్తిన తమకు మేము చేసే గౌరవం మిక్కిలి పేదది, అయోగ్యమైనది మాత్రమే ఔతుంది. పూర్వం తామొనర్చిన గౌరవాలకు, నూతనంగా ప్రసాదించిన గౌరవాలకు, మేము తమ సంక్షేమాన్ని కోరుతూ నిత్యం జపం చేసే మాలాధారుల" మైన మౌనులం కాక తప్పదు. డంకన్ : కౌడర్ థేన్ ఎక్కడున్నాడు? ఇంకా తిరిగిరాలేదా? అతడికంటే ముందు చేరుకోవాలని మేము అతడు బయలుదేరిన వెంటనే అనుసరిస్తూ వచ్చాము. అలా జరగటానికి వీలులేదు. అతడు గొప్ప అశ్వికుడు. మీ మీది ప్రేమ కూడా అతణ్ణి మాకంటే ముందుగా ఇంటికి చేర్చటానికి తోడ్పడివుంటుంది. ఉచితజ్ఞవూ, ఉదాత్తవూ అయిన ఆతిథేయీ! ఈనాటి రాత్రి మేము మీకు అతిథులము. మేక్బెత్ ప్రభ్వి : తమ సేవకులు - మేము అందులోవారమే - తమను, తమ అధీనంలో ఉంచిన సమస్తాన్నీ, మహారాజులైన తాము కోరినప్పుడు తమపరం చెయ్యటానికి ఎన్నడూ సంసిద్దులే కదా! సత్యానికి ఈ సమస్తం తమదే కదా!! డంకన్ : ఏదీ మీ హస్తం? మమ్మల్ని మా ఆతిథేయుని దగ్గరకు తీసుకువెళ్ళండి. అతడంటే మాకు అమితగౌరవం ఇంకా మేము అతడిమీద మా గౌరవాభిమానాలను క్రుమ్మరింపదలచాము. గేహినీ! మరి అనుజ్ఞనిస్తారా? (నిష్క్రమిస్తారు) 375
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/375
స్వరూపం