Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేక్బెత్ ప్రభ్వి : ఇక్కడనుంచి తిరిగి అతడు వెళ్ళట మెప్పుడు? మేక్బెత్ : ప్రస్తుతోద్దేశప్రకారం రేపు. మేక్బెత్ ప్రభ్వి : అట్టి రేపు సూర్యునిముఖం చూడబోదు. నా థేన్ మహాశయా! మీ మోము ఎన్నో అతీతవిషయాలను గ్రహింపదగ్గ గ్రంథంలా కన్పిస్తున్నది. లోకం కన్నులు కప్పటం కోసం సమయోచితాచారాల విషయంలో శ్రద్ధ వహించటానికి అలవాటు పడండి. మీ కన్నుల్లో, చేతల్లో, మాటల్లో స్వాగతం చెప్పటమే కనిపించాలి సుమా! ఏమీ ఎరగని సుకుమార కుసుమంలా కనిపించండి. కానీ అందులో సర్పంలా ఉండిపోవటం మరిచిపోవద్దు. వస్తున్న వ్యక్తి విషయంలో అతిశయమైన శ్రద్ధ వహించండి. ఆ విషయంలో మీరేమీ ఆందోళనపడవద్దు. దేనిని పరిపూర్తి చేయటం వల్ల మీ కీ దేశం మీద తదనంతర జీవితకాలమంతా యాజమాన్య సార్వభౌమాధికారాలు దక్కుతాయో, ఆ అతిప్రధానమైన వ్యవహారాన్ని నా అధీనం చెయ్యండి. మేక్బెత్ : మనం తరువాత మరోమారు ఈ విషయాన్ని గురించి ప్రసంగిద్దాము. మేక్బెత్ ప్రభ్వి : ముఖకాంతి వివర్ణమౌటమంటే భయాన్ని వ్యక్తం చెయ్యటమన్నమాట! ఉత్సాహంతో కనిపించటం తప్ప మీరు చేయవలసింది మరేమీ లేదు. మిగిలిన వ్యవహారం సర్వం నాకు విడిచిపెట్టండి. (నిష్క్రమిస్తారు) ఆరోదృశ్యం మేక్బెత్ సౌధం ముందు. సన్నాయి ధ్వనికారుల సంగీతం వినిపిస్తుంది. కాగడాలతో మేక్బెత్ సేవకవర్గం నిలుచుంటారు డంకన్, మాల్కొం, డొనాల్బెయిస్, బాంకో, లెన్నాక్స్, మాక్డఫ్, రాస్, ఆంగస్, సేవకవర్గం ప్రవేశిస్తారు. డంకన్ : ఈ హర్మ్యం మహామనోహరమైన ప్రదేశంలో నిర్మితమైంది. సువాసనా శోభితమైన యిక్కడి మనోహరపవనం మన యింద్రియాలకు ప్రశాంతిని చేకూరుస్తున్నది. బాంకో : అతిథులుగా వేసవిలో మన దేశానికి వచ్చి ఆలయాల్లో గూళ్ళు కట్టే ఏట్రింతలు" నివాసం చేస్తుండటం వల్లనే ఇచ్చటి వాయువు నిజమాధుర్యం చేత మనలను ఆకర్షిస్తున్నదన్న అంశం స్థిరపడుతున్నది. 374 వావిలాల సోమయాజులు సాహిత్యం-3