Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భర్త పంపించిన లేఖను చదివిన వెంటనే "మీరు ఇప్పటికే గ్లామిస్కు ధేనులైనారు! కౌడర్కు థేనులైనారు. మంత్రగత్తెలు జోస్యం చెప్పినట్లు మున్ముందు మహారాజులు కూడా ఐతీరుతారు” అన్న వాక్యాలు తన ఈమె మనోనిశ్చయదృఢిమ ఎంతటి గాఢమైందో వ్యక్తం చేస్తున్నవి. మేక్బెత్ ప్రభ్వికి శక్తి యెంతో తెలుసును. ఆ శక్తిమీద ఆమెకు అధికవిశ్వాసముంది. భర్త దుర్బలచిత్తం మీద తన కెంతటి ప్రభావం ఉందో కూడా ఆమెకు తెలుసు. "మీ శ్రవణేంద్రియాలను నిరంతరం ఉత్సాహంతో నింపివేస్తూ, వీరోచిత వాక్రసంగాలతో దైవానుగ్రహం, అదృష్టశక్తులూ నిర్ణయించి యిచ్చిన స్వర్ణకిరీటానికీ, మీకూ మధ్య ఆటంకంగా నిలుస్తున్న మీ ప్రకృతిలోని వెనకాడటమనే గుణాన్ని వెంటబడి తరిమి వేస్తాను!" అన్న వాక్యాలిందుకు నిదర్శనాలు. “మానవులమనోభావాలను వెన్నంటి ఉండే ఓ అదృష్టశక్తుల్లారా! రండి! నాలోని స్త్రీత్వాన్ని తొలగించండి!" అన్న వాక్యాలు మేక్బెత్ను తొలిసారిగా ఆహ్వానిస్తూ పలికిన "ఘనుడా! గ్లామిస్ యోగ్యుడా కౌడర్!! అనతికాలంలో మీకబ్బనున్న బిరుదంతో మిమ్మల్ని ఆహ్వానించటానికి అంగీకరించండి” అన్న వాక్యాలు, ఈమె మేక్బెత్ రాకకు పూర్వమే డంకన్ హత్యాపథకాన్ని ఊహించి చిత్తంలో స్థిరం చేసుకొన్నట్లు ద్యోతకం చేస్తున్నవి. తాను సూచించిన మార్గాన్ని గురించి అనుమానిస్తూ తట్టాడుతున్నప్పుడు, రెండో పర్యాయం మేక్బెత్తో ప్రసంగించిన సందర్భంలో "మనకపజయమా? స్థిరనిశ్చయం కలగటానికి మీరు ధైర్యాన్ని చిక్కబడితే చాలు” అని అన్నమాట, యీ మేక్బెత్ ప్రభ్వి అమోఘ స్థిరసంకల్పానికి తార్కాణం. భర్తమీద ఈమె ప్రభావం ఎంత విస్తారమో "భీతచిత్తవుగాని నీ గర్భం మగబిడ్డలను తప్ప మోయలేదు. నీవు పురుషసంతానం మాత్రమే పుట్టదగ్గ తల్లివి” అని మేక్బెత్ అన్న మాటలవల్ల తెలుస్తున్నది. "మిగిలిన వ్యవహారపర్వం నాకు విడిచిపెట్టండి" అని అనటంలో, ఏ భారాన్ని వహిస్తానని భర్తకు మాట యిస్తున్నదో ఈమెకు బాగా తెలుసు. వంచనాశక్తితో డంకన్ హత్య అనే తానాల్లిన పథకాన్ని, తాను తమమీద అనుమానం కలగకుండా నిర్వర్తింపగలనని ఆమెకు గట్టి నమ్మకం. ఒకవంక హత్యోద్యోగానికి సంసిద్ధురాలై, మరోవంక మనోహరకంఠంతో డంకన్ ను అతిథిగా ఆహ్వానించే సందర్భంలో పలికిన స్వాగతవాక్యాలు ఈమె వంచనాశక్తికి ప్రబలనిదర్శనాలు. 354 వావిలాల సోమయాజులు సాహిత్యం-3