మంత్రగత్తెలు జయవెట్టినప్పుడు అతడు తొలుత చలించి బెదరటం ప్రారంభించాడు. దాన్నిగురించి బాంకో "ఇంతటి ప్రియమైన వార్త విన్నప్పుడు ఇలా బెదురుతున్నారేమిటి?" అని ప్రశ్నించినపుడు, అతని దుష్టచిత్తం ఒక్కమాటుగా తన రహస్యం బయటపడ్డదో అన్నట్లు చకితమైనదన్నమాట! డంకన్ రాజు అతణ్ణి "కౌడర్ థేనును చేశా" డని విన్న తరువాత, మేక్బెత్ ఆశాపరత స్వేచ్ఛాసంచారం చేసింది. అతడి భావవీథిలో డంకన్ హత్యాకాంక్ష స్ఫురించి ఒకమారు భయపెట్టింది. అత్యాశాపరుడైన మేక్బెత్కు ఈ హత్యాకాంక్ష అప్పుడు కలిగింది కాదు. మేక్బెత్ ప్రభ్వి సంభాషణవల్ల (అం I దృ 7) అది ఎన్నడో కలిగినట్లు, భార్యాభర్తల మధ్య దానిని గూర్చి చర్చలు జరిగినట్లు అవగతమౌతున్నది. డంకన్ రాజు తన కుమారుడైన మాల్కొంను కంబర్లాండు యువరాజుగా నియమించినప్పుడు, మేక్బెత్ ఆశాపరత్వానికి లక్ష్యమైన సింహాసన సంపాదనకు నిశ్చితసాధనమైన హత్య కంటిముందు పొడకట్టింది. “నేను సింహాసనాన్ని అధిరోహించే విషయంలో నా మార్గమధ్యాన ఒకమెట్టు ఏర్పడింది. నేను దీన్ని తట్టుకొనిపడవచ్చు లేదా దుమికి బయటపడవచ్చు. ఓ తారకల్లారా! మీ మీ తేజాలను తిరోహితాలు చెయ్యండి!! కలుషాలైన నా రహస్యాకాంక్షలను బయటపెట్టకండి!" అని మేక్బెత్ అనటం లక్ష్యసిద్ధికోసం అప్పుడే అతడు అమూల్యాలైన సర్వమూల్యాలను, సర్వనైతిక సూత్రాలను పరిత్యజించాడని వ్యక్తం చేస్తున్నది. డంకన్ హత్యకు తన అత్యాశ తప్ప అన్యమైన బలవత్తరకారణం ఏమీలేదని అతడికి బాగా తెలుసును. హత్యా నిర్ణయ విషయంలో అతడు కొంత ఆందోళనను, వ్యాకులపాటును ప్రదర్శించటం ధర్మభీతి వల్ల కాదు! మంచిచెడ్డల మధ్య మనస్సులో కలిగిన మథనవల్ల అంతకంటే కాదు. అదంతా బయటపడిపోతామేమోనన్న భయభావం వల్ల పడ్డ యాతన. ప్రథమాంకంలోని ఏడో దృశ్యంలో కనిపించే దీర్ఘమైన మేక్బెత్ స్వగతాన్నంతటినీ ఇందుకు ప్రధానోదాహరణగా గ్రహించవచ్చు. అందువల్లనే డౌడన్ మహాశయుడు "మేక్బెత్ తన్నొక బండవానిగను, నీచదోషిగను రూపొందించుకొనగల మంచితనాన్ని నిల్పుకొన్నాడేగాని, దోషం నుంచి దూరునిగా నిల్పగలిగినంత మంచితనాన్ని వహించలేకపోయినాడు" అని అనాడు. మేక్బెత్ విశ్వాసఘాతుకుడు. ఈ గుణవిశేషం అతనికి తొలుత భీతిని కలిగించింది. డంకన్ ను హత్యచేసే విషయంలో అతడు మొదట కలిగిన ఉద్దేశాన్ని మానివేయటానికి సగంవరకూ నిశ్చయం చేశాడు. కానీ అతడు తన భార్యను కలుసుకొన్న తరువాత, 347
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/347
స్వరూపం