ఇట్టి స్థితిలో డంకన్ రాజు తానే మేక్బెత్ దుర్గమైన ఇన్వర్నెన్కు ఆతిథ్యాన్ని స్వీకరించటానికి వస్తున్నాని మేక్బెతు తెలియజేస్తాడు (దృశ్యం 4). ఇన్వర్నెస్ దుర్గంలోని సౌధంలో మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని గురించి మేక్బెత్ వ్రాసిన ఉత్తరాన్ని చదువుతూ, అందులో అప్పటికే కొంతభాగం సత్యమైనందుకు సంతోషించి, మిగిలిన భాగాన్ని పూర్తిచేయటం కోసం భర్తను త్వరపెట్టి డంకన్ ను హత్య చేయించటానికి మేక్బెత్ ప్రభ్వి నిశ్చయిస్తుంది. ఒక వార్తాహరి వచ్చి డంకన్ రాజు వారి దుర్గానికి అతిథిగా వస్తున్నాడన్న వార్తను మేక్బెత్ ప్రభ్వికి నివేదిస్తాడు. స్వల్పకాలంలో మేక్బెత్ వస్తాడు. మేక్బెత్ ప్రభ్వి భర్తను మాంత్రికురాండ్రు జయవెట్టిన రీతిగా ఆహ్వానిస్తుంది. ఆమె సార్వభౌమాధికారాన్ని సంపాదించాలంటే డంకన్ హత్య అత్యవసరమని, అన్యమార్గం లేదని భర్తకు మంతనం చెబుతుంది (దృశ్యం 5). మేక్బెత్ దుర్గం దగ్గరికి వచ్చి డంకన్ రాజు అచ్చటి ప్రకృతి విలాసాన్ని, ప్రశాంత వాతావరణాన్ని ప్రశంసిస్తాడు. ఆయాతుడైన రాజును అత్యాదరంతో మేక్బెత్ ప్రభ్వి ఆహ్వానించి స్వాగతం చెబుతుంది. (దృశ్యం 6) మేక్బెత్ తనకు అతిథిగా వచ్చిన మహారాజు డంకను హత్య చేయటమా, చేయకపోవటమా అని డోలాందోళితమనస్కుడై కళవళపాటు పొందుతుంటాడు. అనుమానభయాలు ఆవరిస్తున్నప్పుడు మేక్బెత్ ప్రభ్వి ప్రవేశించి అతని భీరుత్వాన్ని నిందించి, ప్రతిజ్ఞాభంగం చెయ్యవద్దని ఉద్బోధించి హత్యకాతణ్ణి స్థిరనిశ్చయుణ్ణి చేస్తుంది. ద్వితీయాంకం - ప్రథమవిద్రోహం మేక్బెత్ సౌధప్రాంగణంలో రాత్రి బహుకాలం గడచిన తరువాత, మేక్బెత్ బాంకోను, అతని పుత్రుడు ఫ్లియాన్సులను కలుసుకొని, మంత్రగత్తెల జోస్యం బాంకోమీద ఎలా పనిచేస్తున్నదో తెలుసుకో యత్నిస్తాడు. బాంకో సమాధానాల వల్ల అతడు డంకన్ హత్యలో తనతోబాటు భాగస్వామి కాడని అతడు గ్రహిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయినతరువాత ఏకాంతంగా ఉన్న సమయంలో మేక్బెత్కు డంకన్ కక్ష్యవైపునకు దారి చూపిస్తూ ఉన్న ఒక ఛురికాఛాయామూర్తి కనిపిస్తుంది. ఇంతలో మేక్బెత్ ప్రభ్వి ఇచ్చిన సూచనను అందుకొని, అతడు డంకన్ ను హత్య చేయటానికి అతడి కక్ష్యకు వెళ్ళుతాడు (దృశ్యం 1). ఏమైందో అన్న ఉద్వేగంతో మేక్బెత్ ప్రభ్వి తహతహపడుతుండగా, మేక్బెత్ డంకన్ ను హత్య చేసి రక్తపంకిలాలైన హస్తాలతో ఆమెదగ్గరికి వస్తాడు. బాహ్యస్మృతి 340 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/340
స్వరూపం