ఆయన పెట్టుకొన్న పని. లోకంలో ద్వేషం ఎలా ఉంటుందో, అలాగే దౌష్ట్యం నుంచి లోకాన్ని ఉద్దరించాలన్న పవిత్రభావం కూడా ఉంటుందని ఆయన నిరూపిస్తుంటాడు. అవి రెండూ తగ్గ ప్రతిఫలాలను ఈ లోకంలోనే అనుభవించటం ఆయన రచనల్లో కనిపిస్తుంది. షేక్స్పియర్ విషాదాంతాలలో కథ ప్రధానంగా ఒకరికి - నాయకుడికి లేదా ఇరువురికి - నాయికానాయకులకు సంబంధించి ఉంటుంది. ఇందులో విపదనుభవ పతనాలు విశిష్టంగా ఉంటాయి. అవి ఒక అసామాన్యవ్యక్తికి సంబంధించినవై ఉంటాయి. పూర్వం ఆ వ్యక్తి కీర్తి వైభవాలను అనుభవించినవాడై ఉంటాడు. ఆపదలు, చర్యలనుబట్టి వ్యక్తుల చర్యలనుబట్టి ఉద్భవిస్తుంటాయి. విషాదాంత కేంద్రం పాత్రలశీలంనుంచి ఉద్భవించిన చర్యలోగాని లేదా చర్యలవల్ల జనించిన శీలంలోగాని ఉంటుంది. పాత్రల శీలమే విశేషంగా ఈ చర్యలకు మూలాధారమై ఉంటుంది. పాత్రలోని ఏకైక విషయపక్షపాతం వల్లనో, ఏకైకాశయ నిమగ్నత వల్లనో, ఏకైకభావమనో నిశ్చలత వల్లనో విషాదాంతగుణం ప్రదర్శిత మౌతుంది. ఈ గుణం విషాదాంత నాటక నాయకుని ఇతరవిషయాలలో అశక్తుని చేస్తుంటుంది. ఈ విషాదాంతగుణమే అతని ఏకైకగుణమై పతనాన్ని ప్రాప్తింపజేస్తుంటుంది. మేక్బెక్లో తనది కానిదానిని పొందవలెనన్న స్వార్థపరమైన అత్యాశ, మేక్బెత్ ప్రభ్వి అంతకంటే శక్తిమంతమైన ప్రణయ, స్వార్థరాహిత్యాలతో కూడిన అత్యాశ, స్వేచ్ఛా సంచారం చేసి ఉత్తములైన ఆ దంపతుల పతనానికి దారి తీసింది. ఉత్తమకార్యసాధకులు కాదగ్గ వారిరువురూ అత్యాశవల్ల వినాశాన్ని పొందటం చేత, వారి కథావస్తువుతో గూడిన మేక్బెత్ను విమర్శకులు 'అత్యాశావిషాదాంతము' అని భావించారు. స్నిడర్ మహాశయుడు మేక్సెత్ను 'భావవిషాదాంత' మన్నాడు. బాహ్యదృష్టికి మేక్బెత్ విధి సోదరీమణుల ప్రేరణం వల్ల నిర్దోషి యైన డంకన్ ను హత్య చేసినట్లు కన్పించినప్పటికీ, ఈ చర్యకు బాధ్యత అంతా అతనిదే. ఈ విధి సోదరీమణుల రూపాలు అతని కాంక్షలు, అత్యాశాదులవల్ల కళవళపాటును పొందుతున్న మనస్సు నుండి ఉద్భవించి స్వాతంత్ర్యాన్ని పొందినవే. బాహ్యంగా మేక్బెత్ కొంత శిక్షను అనుభవించినా అతడు, అతని పత్ని మేక్బెత్ ప్రభ్వి విశేషంగా మానసిక భావనలవల్ల అధిక వేదనను అనుభవించారు. అందువల్ల మేక్బెత్ను 'భావనావిషాదాంత' మనటం సమంజసమే. 334 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/334
స్వరూపం