Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విచిత్రసన్నివేశంలో ప్రదర్శించి చూపించటంకోసం విందుకు ముందే ఆ హత్య జరిగిపోయినట్లు మార్చాడు. హాలిన్ షెడ్ రచనలో మేక్బెత్ రాజు పదిహేడు సంవత్సరాలు పాలించినట్లుంటే, కథాగమనానికి అంతటికాల విలంబం తగదు గనుక షేక్స్పియర్ ఆ కాలంలో జరిగిన అంశాలన్నీ స్వల్పకాలంలోనే జరిగిపోయినట్లు నిరూపించి, విషాదాంతనాటకానికి అవశ్యకమైన గమనతీవ్రతను కల్పించాడు. రాజ్యహరణానంతరం కొంతకాలం మేక్బెత్ ధర్మప్రవృత్తితో ఉదాత్తంగా రాజ్యపాలన చేసినట్లు హాలిన్ షెడ్ రచన చెబుతున్నది. మంత్రగత్తెల ప్రభావానికి లోనైన మేక్బెత్ నిజరక్షణకోసం చేసే రక్తపాతం విషయంలో కాలవిలంబం పనికిరాదు కనుక, అతణ్ణి షేక్స్పియర్ రాజ్యహరణం చేసిన తొలినాటినుండి కూడా క్రూరనిరంకుశు ణ్ణిగానే నిరూపించాడు. హాలిన్ షెడ్ రచనలో డంకన్ రాజు శక్తిహీనుడు, యువకుడు. రాజ్యవ్యవహారాలను పట్టించుకోకపోవడం వల్ల సర్వ వ్యవహారాలకూ మేక్బెత్ మీద ఆధారపడ్డాడు. కానీ షేక్స్పియర్ మహాకవి మేక్బెత్ హత్యాదోషాన్ని తీవ్రతరంగా ప్రదర్శించడం కోసం, డంకన్ న్ను వృద్ధుడైన ఆదర్శప్రభువుగా రూపొందించినాడు. హాలిన్ షెడ్ రచనలో బాంకో మేక్బెత్కు తోడ్పాటునిచ్చినట్లుంది. నాటకంలో షేక్స్పియర్ ఇతణ్ణి మేక్బెలు ప్రతిపాత్రగా గ్రహించి సర్వసద్గుణాన్వితుడైన మహోదాత్తమూర్తిగా మలచాడు. మేక్బెత్ ప్రభ్వి హాలినెడ్ రచనలో రాజీనామంకోసం ఆరని దాహాన్ని వహించి, భయాన్ని కల్పించేటంతటి అత్యంత స్వార్థపరురాలైన అతివగా కనిపిస్తుంది. షేక్స్పియర్ నాటకంలో మేక్బెత్ ప్రభ్వి శీలాన్ని కొంతగా సరిదిద్దాడు. మేక్బెత్ రూపకంలో ఆమెలోని స్త్రీత్వం కొంత లోపించినా, మూలంలోని అత్యంతస్వార్థపరత్వం అదృశ్యమై గోచరిస్తుంది. ఆమె నిర్వహించిన సమస్తం తనకోసం కాక భర్తయైన మేక్బెత్ కోసమని స్పష్టమౌతుంది. స్త్రీత్వం లోపం, క్రౌర్యతీక్షత లుంచినా షేక్స్పియర్ ఆమెకు స్వార్థత్యాగ మొక గుణవిశేషంగా కల్పించాడు. చరిత్రలో ఈ మేక్బెత్ పత్ని జీవితం ఏమైందీ కన్పట్టదు. షేక్స్పియర్ నాటకంలోని 'నిద్రాగమనదృశ్యానికి' (అం. V దృI) గాని, 'విందు దృశ్యానికి' (అంIII దృ6) గాని, 'ఛురికాదృశ్యానికి' (అం దృI)గాని చరిత్రలో ఎట్టి ఆధారాలూ లేవు. చరిత్ర షేక్స్పియర్కు కేవలం ఛాయామాత్రమైన రూపాన్నే ఇవ్వగలిగింది. జగదేకనాటకకర్త అన్న విఖ్యాతిగన్న ఈ మహాశిల్పి, ఘనవిషాదాంత నాటకచతుష్టయంలో ఒకటిగా పరిగణితమవుతున్న 'మేక్బెత్ 'లోని కళావిలసనమంతా రచయితదే! 327