ఆంటోనీ మేధావి, భావోద్వేగి, ధైర్యసాహసాలు కలవాడు, ఎట్టి క్లిష్టపరిస్థితినైనా తన కనుకూలంగా త్రిప్పుకోగల ప్రవీణుఁడు. గౌరవాధికారాలపై ఆసక్తి కలవాఁడు. విలాసప్రియుడు. వినోదశీలి. సీజర్ ఎడ అతని భక్తిభావం అచంచలం, అమలినం, పరిపూర్ణం. ప్రభువర్గతత్త్వం అతడిలో జితించిన గుణం. అతడు పన్నుగడలు పన్నగల కుశాగ్రబుద్ధి. హృదయార్ద్రతకంటే విధానానుసరణం మీద అతడికి దృష్టి విశేషం. కానీ ఇతరుల ఉదాత్తతయెడ అంధుడు మాత్రం కాదు. బ్రూటస్ వలె ఇతడు నీతిసూత్రాలతో కొలిచి ఇతరులకు విలువ కట్టడు. ఆంటోనీ రాజకీయజ్ఞుడే కాని అతడి రాజకీయాలకు వ్యక్తిగతకారణాలు సుస్థిరసూత్రమేదీ ఆధారం కాదు. అందువల్లనే అతడు తదనంతర చరిత్రలో పరాజితుడైనాడు.
సీజరంటే అతనికి అపారభక్తి. 'సీజర్ ఏదైనా చెయ్యమంటే అది జరిగినట్లే' అన్న అతడి వాక్యంలో అణుమాత్రమైన స్తోత్రప్రియత్వం లేదు. సీజర్ మీద భక్తే అతణ్ణి వధానంతరం హంతకుల మధ్యకు నడిపించింది. సీజర్ కు జరిగిన మహాద్రోహం అతడిలో నిస్సీమమైన ఉద్రేకాన్ని కల్పించి దౌష్ట్యాచరణకు ప్రేరేపించింది. విజయాన్ని చేకొన్న విద్రోహులతో స్నేహం చేసుకొని అధికారాన్ని పంచుకోవటానికి పూనుకోకపోవటమే ఆంటోనీ స్వార్థరహితమైన స్వామిభక్తిని ప్రకటిస్తుంది.
అతడు రాజకీయాలలో నీతివిరహితుడు. ప్రజలను వక్తృత్వంతో ఉద్రేకపరచి "ఇది ఇక వ్యహరించుగాక! దౌష్ట్యమా! నీవు పయనమారంభించావు స్వేచ్ఛాను సారంగా విహరించు" అని అనటం వల్ల అతడి హృదయకౌటిల్యం వక్తమౌతున్నది. ప్రజలకు సీజర్ ఇచ్ఛాపత్రంలోని ప్రజాదానాల గురించి తెలియజేసి, తరువాత వాటిలోని ఆ భాగాలను తొలగించి ప్రజలను మోసగించటానికి లెపిడస్ చేత ఇచ్ఛాపత్రాన్ని తెప్పించటం, వీరత్రయకూటమిలో సభ్యుడైన లెపిడసన్ను గురించి అతడు ఆక్టేవియస్తో వెల్లడించిన భావాలు, మాటలకు మనస్సుకూ గల అసంబద్ధతను తెలియజేస్తున్నవి. తనతో సమానుడైన వీరుడు గదా లెపిడస్! అతడు భారవహనానికి పనికివచ్చే గార్దభమట! అతడిది ఎంతటి కుటిలహృదయం!
అతని క్రీడాభిరతి, విలాసప్రియత్వం, కొంతవరకు సహించ దగ్గవైనా అతని క్రూరత్వం, హృదయ రాహిత్యం క్షంతవ్యాలు కానివి. లెపిడస్ కోరితే తన మేనల్లుని “ఒక్క చుక్కతో తుడిచిపెడుతున్నా” నన్నాడు.
జూలియస్ సీజర్
31