ప్రొక్యూలియస్ : ఆగు! మహారాజ్జీ! ఆగు. (అందుకొని కత్తిని తీసివేస్తారు) ఇంతటి దోషాచరణం చేసుకోవటం తగని పని. ఇందువల్ల మిమ్మల్ని రక్షిస్తున్నాము గాని మోసగించటం లేదు.
క్లియోపాత్రా : ఏమిటి? మహావేదన నుంచీ కుర్కురాలను కూడా బయటపడవేసే మృత్యువునుంచి కూడానా?
ప్రొక్యూలియస్ : రాజ్జీ, క్లియోపాత్రా! మిమ్మల్ని మీరే నాశనం చేసుకోటంతో మా యజమాని తన కరుణారసాన్ని ప్రదర్శించుకోటానికి కలిగిన అవకాశాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు. ఆయన ఔదార్యం మీ మరణంవల్ల రంగస్థలం మీదికి వచ్చే అవకాశాన్ని కోల్పోతుంది. అది అద్భుతశక్తితో నటియిస్తే తిలకించే అవకాశాన్ని అఖిలప్రపంచానికీ కల్పించండి.
క్లియోపాత్రా : మృత్యువా, నీవెక్కడున్నావు? రా నాకు. దర్శనమివ్వు. వచ్చి బిడ్డలకూ, భిక్షువులకూ తుల్య అయిపోయిన ఈ రాణిని తీసుకుపో!
ప్రొక్యూలియస్ : రాజ్జీ! ప్రశాంతచిత్తలు కండి.
క్లియోపాత్రా : ఇక నే నా ఆహారాన్ని స్వీకరించను. పానీయాన్ని సేవించను. వేగంగా మరణించడానికి ఉన్మత్తప్రలాపాలు అవసరమైతే నేను నిద్రకూడా పోను. నిలపటానికి సీజర్ ఎట్టి యత్నాలు చేసినా నా ఈ భౌతికశరీరాన్ని నేను వినాశనం చేస్తాను. మీ యజమాని తీర్చే సభలో బద్ధహస్తనై నిలుచోనని తెలుసుకో. మందబుద్ధి ఆ ఆక్టేవియా అలక్ష్యపుచూపులనే శిక్షలను అందుకోను. కరతాళధ్వనులతో గందరగోళం చేస్తూ నన్ను అధిక్షేపించటానికి ఆ రోమకజానపదుల కోసం పైకెత్తి నన్ను ప్రదర్శింపదలచారా? ఇంతకంటే ఈజిప్టులోని ఓ చిన్నగరమైనా నాకు కమనీయమైన సమాధి ఔతుంది. ఇంతకంటే నా నగ్నమృతశరీరాన్ని నైలునదీ పంకప్రదేశం మీద పారేస్తే, అక్కడి నీరమక్షికతతి నిలువెల్లా వికృతరూపం కలిగేటంతవరకూ కుట్టిపెట్టినా నేను ఇష్టపడతాను. ఇంతకంటే నా దేశంలోని మహోన్నత నిర్మాణాలైన పిరమిడ్లనే నా వధ్యభూమిగా చేసి నన్ను శృంఖలాబద్దను కావించినా నేను తృప్తి పడతాను.
ప్రొక్యూలియస్ : ఇంతటికే కారణం కనిపించనిదే సీజర్ యెడ మీరీ ఘోరభయభావాన్ని వహించి ఊరికే ఏవేవో ఊహిస్తున్నారు!
దోలబెల్లా ప్రవేశిస్తాడు.
292
వావిలాల సోమయాజులు సాహిత్యం-3