Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాషియస్

కాషియస్ స్వభావం చేత, శిక్షణవల్లా ఎపిక్యూరస్ తత్త్వం కలవాడు. పునర్జన్మ మీద నమ్మకం అతడికి లేదు. 'మానవ జీవితాలమీద దేవతల కెట్టి ప్రభావం లేదు' అని అతని విశ్వాసం. మరణానికి ఇంచుక పూర్వం తన అభిప్రాయాలను మార్చుకున్నా, అతడు శకునాలంటే నమ్మడు. బ్రూటస్ కష్టసుఖాలకు అతీతుడుగా ఉండలేనివాడు. అతికోపస్వభావం కలవాడు. ఈ గుణాన్ని తల్లివల్ల పొందానని తానే బ్రూటస్ తొ చెప్పుకున్నాడు.

ప్రజాస్వామికమంటే అతడికి ప్రియమైనదే. కానీ ఆ ప్రేమ ఒక విశాల సిద్ధాంతంమీద ఆధారపడి ఉండదు. తాత్కాలిక ప్రయోజనం చేకూరితే అది తృప్తి పడుతుంది. అరాజకానికి దారితీస్తున్నానేమో అన్న భయం దానికి లేదు. బ్రూటస్ సిద్ధాంతాన్ని అనుసరించి వ్యవహరిస్తే కాషియస్ కేవలం ఉద్రేకాన్ని బట్టి నడుచుకుంటాడు. అతడు ఉదాత్త సిద్ధాంత ప్రబోధకుడు ఇతడు రాజనీతి చతురుడు. కాషియస్లో ఉదాత్తదుష్ట ప్రకృతులు రెండూ సమ్మేళనాన్ని పొందాయి. సీజర్ ఘనతయెడ ఈర్ష్య వహించాడు. కానీ కేవలం ఈర్ష్య వల్లనే ఇతడు సీజర్ యెడ విద్రోహ వర్గాన్ని కల్పించటంలో సమాహర్త యైనాడనటానికి వీల్లేదు. ఇతడికి ప్రజాస్వామ్యాభిమానం లేకపోలేదు అయితే అది సంకుచితమైంది. అయినప్పటికీ ఇతడు దాని కోసం తన ప్రాణాలు అర్పించి, తన దోషాల నన్నింటినీ దగ్ధం చేసుకొన్నాడు.

తనకు అంతశ్శక్తి, క్రమశిక్షణ లేదని కాషియస్ ఆత్మపరీక్షల వల్ల తెలుసుకున్నవాడు కావటం వల్లనే నాయకత్వాన్ని బ్రూటస్ పరంచేసితాను అనుచరుడైనాడు. తన నిర్ణయాలు సక్రమమైనవనీ, కార్యసాధకాలైనవనీ అతడికి తెలిసినా, బ్రూటస్ కున్న నైతికబలం తనకు లేకపోవటం వల్ల ఎల్లవేళలా లొంగిపోతుండేవాడు. బ్రూటస్ కంటే కాషియస్ నైతికంగా తక్కువవాడైనా రాజకీయంగా ఎక్కువవాడు. రాజకీయాలలో అతడి బుద్ది అతినిశితంగా వ్యవహరిస్తుంది.

అతడు వ్యవహారదక్షుడైన రాజకీయవేత్త. వ్యక్తులను అతినిశితంగా పరిశీలిస్తాడు. మానవస్వభావ పరిశీలనలో అందెవేసిన చేయి. తన యుక్తితో, చాతుర్యంతో సీజర్ మీద విద్రోహాన్ని చేసి క్రమంగా ఒక్కొక్కరినీ ఆ వర్గంలోకి చేర్చగలిగాడు. బ్రూటస్ వంటి మహోత్తముణ్ణి తనపక్షానికి చేర్చుకోటానికి క్రమమైన విధానాన్ని అనుసరించి సాధించాడు. అతడు క్రమమైన రాజకీయవేత్త. లక్ష్యమే ముఖ్యం కాని అతడికి సాధన ఎటువంటిదైనా సరే. సీజర్ తోబాటు ఆంటోనీని కూడా చంపవలసిన అగత్యాన్ని


జూలియస్ సీజర్

29