Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సర్వకృత్యాలలో ఒక గౌరవస్థానాన్ని ఏ హస్తం కల్పిందో ఆ హస్తం, హృదయమిచ్చిన ధైర్యంతో, దాన్నే చీల్చివేసింది. ఇదిగో, ఇది ఆయన ఖడ్గం. ఆయన గాయం నుంచీ దీన్ని కాజేసుకోవచ్చాను. పరిశీలించండి! ఆ మహోదాత్తుని రక్తంతో పరిషిక్తమైన దీన్ని పరికించండి!

సీజర్ : మిత్రులారా! మీరందరూ విషణ్ణచిత్తులౌతున్నారా? అయితే ఇది రాజనేత్రాలు కూడా కన్నీటిని రాల్చి తీరక తప్పనివార్త!

అగ్రిప్పా : ప్రకృతి మిక్కిలి పట్టుదలతో కొనసాగించి చేయించిన కృత్యాలకు మనచేత తిరిగి చింతించేటట్లు చేయటం ఎంతో వింతైన విషయం.

మెకన్నాస్ : ఆయన ఉదాత్తగుణాలు, ఉన్నతదోషాలు రెండూ తుల్యంగా ఒకదానిమీద ఒకటి పందెమొడ్డాయి.

అగ్రిప్పా : ఆయనవలె ఒక విశిష్టాత్మ నడిపించిన వ్యక్తి సామాన్యంగా కన్పింపడు. అందుకని ఓ దేవతలారా! మీరు మమ్మల్ని మానవులనుగా నిల్పటానికి కొన్ని లోపాలను మాకు ప్రసాదించండి. సీజర్ ఎంతగా చలించి పోతున్నాడో పరికించు!

మెకన్నాస్ : అంతటి విశాలమైన అద్దాన్ని అతనిముందు నిలిపినపుడు సీజర్ తన రూపాన్ని తాను తప్పక చూచుకొని తీరాలి.

సీజర్ : ఓ ఆంటోనీ! ఇది జరిగేదాకా నిన్ను వెన్నాడాను. శారీరకవ్యాధికి కొంత ప్రయోగం ప్రయోజనకారి అయినట్లుగా నా రాజకీయ సంక్షేమానికి నీ మరణం సహాయకారి అయింది. నీ అస్తమయాన్ని నేనో, నా అస్తమయాన్ని నీవో చూడటం అత్యావశ్యకమని విధి నిర్ణయం. ప్రపంచమనే మందూరాలో మనమిర్వురం కలిసి వసించలేమని విశదమైంది. అయితే నా హృదయరక్తంవలె అమూల్యమైన కన్నీటిని విడుస్తూ, ఆంటోనీ, నీ మరణానికి నేను దుఃఖించకుండా ఉండలేను. నీవు నాకు ఆప్తుడవు. సమస్త మహత్తర లక్ష్యాలలోనూ సహవ్రతుడవు. సామ్రాజ్యంలో సహభాగస్వామివి. మిత్రుడవు. సమరాంగణంలో నాకు సమర్థుడవు. నా శరీర బాహువువు. నిఖిలభావోద్వేగాలకు జన్మభూమియైన నా హృదయానికి హృదయానివి. సర్వ విషయాల్లో నీవు నాతో సమానుడవు. లక్ష్యాల విషయంలో మనకు పొత్తు కుదరదని నిర్ణయించుకొన్న మన అదృష్టం నా చేతనే ఇలా మనలో ఒకరు వినాశాన్ని పొందటమనే క్షుద్రస్థితిని అంగీకరించి వ్యవహరించకుండా చేయవలసి ఉంది. -ప్రియమిత్రులారా!


288

వావిలాల సోమయాజులు సాహిత్యం-3