Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిరంకుశత్వ నిర్మూలనం కంటే సీజర్ మృతి కావాలి. అతడికి అవకాశం ఉంటే సీజర్ను సజీవుణ్ణిగా నిల్పి అతడి నిరంకుశతత్త్వాన్ని వినాశనం చేస్తే చాలు. ఈ ఆదర్శ ప్రియత్వం వల్లనే ఆంటోనీని కూడా చంపాలన్న కాషియస్ భావంతో ఏకీభవించక త్రోసివేయటం. 'సీజర్ అంత్యక్రియల్లో ప్రసంగించటానికి ఆంటోనికి అనుజ్ఞ ఇవ్వటం, కాషియస్ సలహాను త్రోసిరాజని కేవలం ఫిలిప్పీ యుద్ధంలోనే తమ సర్వస్వాన్నీ ఒడ్డటం' మొదలైన కొన్ని దోషాలు చేశాడు.

బ్రూటస్ ప్రజాస్వామ్యపక్షపాతి. రోముకు రాజనే పేరునే అతడు సహించలేడు. అంతశ్శుద్ధితో తనపూర్వుడైన బ్రూటస్ చర్యను (టార్క్విన్సును పారద్రోలటం) ఆదర్శంగా పెట్టుకొని సీజర్ విషసర్పాన్ని 'అండంలోనే అవియించటానికి' పూనుకొన్నాడు. బ్రూటస్ ఉద్వేగాలకు లొంగని విజ్ఞాని. అందువల్లనే సీజర్ హత్యానిర్ణయానికి పూర్వం ఆయన మనస్సు డోలాందోళితమైంది. అందులో మహత్తరమైన అంతర్యుద్ధం చెలరేగింది. ఈ ఉద్వేగరాహిత్యం వల్లనే విపణిలో ఆయన చేసిన అనుద్వేగకర ప్రసంగం, ఆంటోనీ చేసిన ఉద్రేకపూరితమైన గంభీరోపన్యాసం ముందు పేలవమై పోయింది.

ఎటువంటి విషమ జీవిత సంఘటనలనైనా అతిప్రశాంతంగా, సహనంతో భరించి, సుఖదుఃఖాలకు అతీతంగా ప్రవర్తించటాన్ని నేర్పే స్టోయిక్ తత్త్వశాస్త్రాభిమాని బ్రూటస్. కానీ కథా సందర్భాలు అట్టి తత్త్వశాస్త్రంతో పరిచయం గల అతణ్ణి కూడా కళవళపెట్టాయి. మిత్రుడి హత్యను గురించి నిర్ణయించుకుండేటప్పుడు చిత్తం అంతర్యుద్దావిద్ధమైంది. రాజకీయ రహస్యాలను భార్యకు చెప్పకుండా దాచలేకపోయాడు. యుద్ధసమయంలో కోపాన్ని తెచ్చుకొన్నప్పుడు కాషియస్ “అనుభవంలో లేకపోతే మీరు చేసిన తత్వశాస్త్రజిజ్ఞాస వల్ల ప్రయోజనమేమిటి?" అని అడగటానికి అవకాశం కలిగింది.

కొన్ని విపరీత పరిస్థితుల్లో అతడిలో తత్త్వశాస్త్రదృష్టి తొలగటం వల్లనే మానవత్వం బహిర్గతమైనది. బ్రూటస్ కరుణా హృదయుడు. ప్రేమించగలడు. ఇతరుల ప్రేమను చూరగొనగలడు. భార్యయెడ, మిత్రులయెడ, స్నేహితుల యెడ అతడి ప్రవర్తన ఈ విషయాలను సుస్పష్టంగా సర్వేసర్వత్రా అభివ్యక్తం చేస్తున్నది.

పఠనాభిమానం, సంగీతరసికత బ్రూటస్ ను మహోత్తముడుగా తీర్చి దిద్దాయి. ఆశయపావిత్య్రం, నైతిక విజయం మరపురాని మహోదారునిగా భావియుగశుభ్ర చరిత్రల్లో అతడికి స్థానాన్ని కల్పించాయి. ఆంటోనీ అన్నట్లు భూతాలన్నీ ఏకమై “మానవుడంటే ఇతడు” అని చెప్పదగ్గ సద్గుణపుంజం బ్రూటస్.


28

వావిలాల సోమయాజులు సాహిత్యం-3