థైరియస్ : మంచిది. ఓ విఖ్యాతిగన్న వనితా, రాజీ! ఇప్పుడు మీ ఉన్నతస్థితినిబట్టి ఆయన మహోదారుడైన సీజర్ అన్నభావంతో తప్ప అన్యంగా గాని భిన్నంగా గాని వ్యవహరింపవలసిన అగత్యం లేదని ఆయనే విన్నవిస్తున్నాడు.
క్లియోపాత్రా : ఇది మహోదారంగా ఉంది కానీ
థైరియస్ : మీరు ఆంటోనీయెడ స్నేహాన్ని ప్రకటించటం భయభావంవల్లనే గాని ప్రణయాతిశయంవల్ల కాదని ఆయనకు తెలియకపోదు.
క్లియోపాత్రా : అలాగా?
థైరియస్ : అందువల్లనే మీ గౌరవవిషయంలో గల మచ్చలు బలప్రయోగానికి లొంగిపోవటంవల్ల కలిగినవే గాని, ఐచ్ఛికంగా ఇచ్చివేసుకోవటంవల్ల అబ్బినవి కావని భావించి ఆయన అందుకు మీ యెడ ఎంతో కరుణారసభావాన్ని ప్రదర్శిస్తున్నాడు.
క్లియోపాత్రా : ఆయన దేవత. సత్యమేమో ఆయనకు తెలుసు. నాకై నేను నా గౌరవాన్ని ఐచ్ఛికంగా అర్పించుకోలేదు. అది కేవలం విజిత.
ఎనోబార్బస్ : ఇందులోని సత్యాన్ని తెలుసుకోటానికి నేను ఆంటోనీని అడిగివేస్తాను. నీకు అత్యంతప్రియురాలైన ఈమే నిన్ను వీడిపోతున్నది. మేమూ నిన్ను విడిచిపోతాము. మునిగిపో! ప్రభూ! నీవీనాడు రంధ్రంపడ్డ నావవైనావు. మునిగిపో!!
(నిష్క్రమిస్తాడు)
థైరియస్ : మీరు సీజర్ను ఏమి కోరుతున్నారో తెలియజేస్తారా మరి? ఒకరీతిగా ఆయన మీరు కోరినవన్నీ ఇచ్చుకొంటానని మిమ్మల్ని ప్రార్థించి తెలియజేస్తున్నాడు. ఆయన సంపత్తిని మీరు అలంబనంగా కల్పించుకోటానికి అతురతవహిస్తే ఆయన మహానందపడతాడు. అయితే మీరు ఆంటోనీని విడచిపెట్టారని, సర్వప్రపంచాధినేత అయిన ఆయన రక్షణక్రిందికి వచ్చారని నా వల్ల వింటే, ఆయన ఆత్మ ఆనందోత్తేజితమౌతుంది.
క్లియోపాత్రా : నీ నామధేయం?
థైరియస్ : థైరియస్.
క్లియోపాత్రా : వరకరుణాగుణాన్వితా! వార్తాహరీ!! ఘనుడైన సీజర్తో నిన్ను ఆయనకు ప్రతినిధిగా భావించి, ఇలా ఆయన విజేతృహస్తాన్ని ముద్దాడానని విన్నవించు. ఆయన
254
వావిలాల సోమయాజులు సాహిత్యం-3