Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెబుతాడని కలగనటం ఎంత వింత! సీజర్ మహాశయా! ఈతని నిర్ణాయకశక్తి మీద కూడా నీవు విజయం చేకొన్నావు!

సేవకుడొకడు ప్రవేశిస్తాడు

సేవకుడు : సీజర్ వద్దనుంచీ ఒక వార్తాహరి వచ్చాడు.

క్లియోపాత్రా : ఏమిటి? నా యెడ చూపవలసిన సమయాచారాలు ఇంతటితో చెల్లిపోయాయా! ఓ నా కన్యకలారా! గమనించండి. ముకుళంలా ఉన్నప్పుడు తావి నాఘ్రాణించటానికి తలొగ్గి నిలిచే మానవులు, వికసించిన గులాబి దగ్గరికి నడిచివెళ్లే నాసికను అరికడతారు. అతణ్ణి ప్రవేశపెట్టు.

సేవకుడు నిష్క్రమిస్తాడు.

ఎనోబార్బస్ : (స్వగతం) నా గౌరవప్రతిపత్తి నాతో భిన్నిస్తున్నది. కలహమారంభించింది. రాజభక్తి పరాయణత్వం బుద్ధిబలాన్ని కోల్పోయినవారిని అంటిపట్టుకొని ఉండటం దానిదోషమే. అయితే ఏ సేవకుడు తత్పరతతో పడిపోయిన యజమానిని అనుసరింపగలుగుతాడో అతడు ఆ యజమాని కంటే ఆధిక్యాన్ని సంపాదించి మరో యజమానికి లొంగినవాని కంటే అధికుడనిపించుకోటమే కాకుండా చరిత్రలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకొంటాడు.

థైరియస్ ప్రవేశిస్తాడు.

క్లియోపాత్రా : సీజర్ నిర్ణయాలేమిటి?

థైరియస్ : మీరు ఏకాంతంగా వినవలసి ఉంది.

క్లియోపాత్రా : ఇక్కడ ఉన్నవారందరూ ఆప్తులే. ధైర్యంతో చెప్పు.

థైరియస్ : సందర్భవశాన వీరందరూ ఆంటోనీకి కూడా ఆప్తులే కదా!

ఎనోబార్బస్ : సీజర్కు ఎందరు ఆప్తులు అవసరమో ఆయనకూ అందరు అవసరం. కానీ యుద్ధం అయిపోతుంది కనుక మాతో పనిలేకుండా పోవచ్చుకూడాను. సీజర్ ఇచ్ఛయిస్తే మా యజమాని మిత్రుడై వర్తించటానికి ఎంతో రయోద్వేగాన్ని ప్రకటిస్తాడు. మేమో, ఆయన ఎవరివాడో మేమూ వారివాళ్ళమే అంటే సీజర్ ప్రజలమౌతా మన్నమాట!


ఆంటోని - క్లియోపాత్రా

253