సైనికుడు : అతడు ఇంకా రోములో ఉండగానే, అతని బలాలు బహురూపాలను ధరించి చారులను మోసగించేరీతిగా వివిధదేశాలకు విచ్చేస్తున్నాయి.
కానెడియస్ : ఆయనకు ప్రధానప్రతినిధి ఎవరో నీవు విన్నావా?
సైనికుడు : అతడెవరో టారస్" అని వారు చెప్పుకొంటున్నారు.
కానెడియస్: అతడు నేనెరిగినవాడే.
వార్తాహరి ప్రవేశిస్తాడు.
వార్తాహరి : కానెడియస్ ను చక్రవర్తి పిలుస్తున్నారు.
కానెడియస్ : విచిత్రమైన వార్తలతో కాలం మహాఘనమైందిగా ఉంది. ప్రతిక్షణం ఏదో క్రొత్తవార్త పుడుతూనే ఉంది.
సీజర్ : టారస్!
ఎనిమిదో దృశ్యం
ఆక్టియం దగ్గర ఒకమైదానం.
సీజర్, టారస్ పయనిస్తూ ఉన్న సైన్యంతో ప్రవేశిస్తారు.
టారస్ : ప్రభూ!
సీజర్ : భూతలంమీద ఎదుర్కోకు. సైన్యాలనన్నిటినీ ఒకచోట సమీకరించు. మేము సముద్రంమీద ఆరంభించే దాక వారిని నేలమీద యుద్ధానికి పురికొల్పకు. ఈ లేఖావలయంలోని ఉత్తరువులను ఎన్నడూ అతిక్రమించకు. మన అదృష్టమంతా ఈ అవకాశం మీదనే ఆధారపడి ఉంది
(నిష్క్రమిస్తాడు)
తొమ్మిదో దృశ్యం
మైదానంలో మరొక ప్రాంతం. ఆంటోనీ, ఎనోబార్బస్ ప్రవేశిస్తారు.
ఆంటోనీ : మన ఆశ్విక సైన్యంలోని ప్రధానదళాలను కొండకు అవతలవైపు యుద్ధసన్నద్ధాలైన సీజర్ సైన్యాలకు ముఖాముఖిగా మోహరించు. వచ్చే నౌకాదళసంఖ్యను అక్కడినుంచీ గమనించి, తగ్గట్టుగా కార్యనిశ్చయం చేద్దాము.
244
వావిలాల సోమయాజులు సాహిత్యం-3