మెకన్నాస్ : రోమన్ ప్రజల కిదంతా తెలియజేయండి.
అగ్రిప్పా: వారు ఆతని గర్వాహంకరణాన్ని గమనించి, అతనిపై తమకు గల సద్భావాన్ని మరల్చుకొంటారు.
సీజర్ : ప్రజలింతకు పూర్వమే ఇదంతా తెలుసుకొన్నారు. ఆతడు చేసిన దోషారోపణలు కూడా వారికి ఇప్పుడే అందాయి.
అగ్రిప్పా : ఆరోపణలు ఎవరిమీద?
సీజర్ : సీజర్మీద. అందులోని ప్రధానాంశాలు : సిసిలీలో సెక్స్టస్ పాంపేను హతమార్చిన తరువాత అతడికి రావలసిన భాగాన్ని నేను లెక్కగట్టి పంచి ఇవ్వలేదట! ఆ యుద్ధానికి తాను కొంత నౌకాదళాన్ని అప్పిస్తే దాన్ని నేను ఇంకా తిరిగి పంపలేదట! చివరి ఆరోపణ మూడవ త్రైకూటవీరుడైన లెపిడన్ ను సామ్రాజ్యతృతీయ భాగాధికారంనుంచీ పదచ్యుతుణ్ణి చేసి, అతని ఆదాయాన్నంతటినీ నన్నే ఉంచుకోమని చిరచిరలాడటం.
అగ్రిప్పా : ప్రభూ! ఈ ఆరోపణలకు సమాధానం చెప్పితీరవలసిందే!
సీజర్ : ఆ పని ఎప్పుడో జరిగింది. సమాధానాలతో వార్తాహరి వెళ్లాడుకూడాను. లెపిడస్ నిరంకుశుడు, క్రూరుడుగా పరిణమించాడనీ, అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటంవల్ల జీవితవిపర్యాసానికి యోగ్యతను గడించాడనీ తెలియజేశాను. నేను జయించిన రాజ్యంలో భాగం ఇవ్వటానికి అంగీకరించాను. అదేరీతిగా అతని ఆర్మీనియాలోనూ, అతడు జయించిన ఇతరరాజ్యాలలోనూ భాగస్వామ్యమిస్తావా అని పృచ్ఛించాను.
మెకన్నాస్ : అతడు ఇందుకు ఎన్నడూ లొంగడు!
సీజర్ : అయితే ఆ పక్షంలో అతడికి నేను కూడా లొంగను!
అక్టేవియా పరివారంతో ప్రవేశిస్తుంది
ఆక్టేవియా : సీజర్ మహాశయా! జయము. జయము!
సీజర్ : 'పతిపరిత్యక్తా!' అని నిన్ను సంబోధించవలసి వచ్చిందేమోనని నేనెంతో బాధపడుతున్నాను.
ఆక్టేవియా : : అలా సంబోధించలేదు కదా! సంబోధించవలసిన అవసరం లేదు కూడాను.
238
వావిలాల సోమయాజులు సాహిత్యం-3