మెనాస్ : (పాంపేతో అపవారితంగా) మీ యెడ నాకు గల ప్రభుభక్తిని పురస్కరించుకొని నేను చెప్పేది వినండి.
పాంపే : (మెనాస్ అపరివారితంగా) నీవు ఉన్మత్తుడవౌతున్నా వనుకొంటాను. విషయ మేమిటి? (లేచి ప్రక్కకు వెళ్ళుతాడు.)
మెనాస్ : నేను మిమ్మల్ని నిరంతరం భక్తితో అనుసరించిన అనుచరుణ్ణి. పాంపే అవును. నీవు నన్ను మహాభక్తితో సేవించావు. చెప్పదలచిన విషయం ఇంకా ఏమైనా ఉందా? (ప్రభువర్గాన్ని ఉద్దేశించి) క్షమించండి. క్షణకాలం మీకు దూరుణ్ణి అవుతున్నాను. ఈ విలాసాన్ని మీరు కొనసాగిస్తుండండి.
ఆంటోనీ : లెపిడస్! క్షణక్షణం మారే ఈ నిలకడ లేని పులినాలల్లో నుంచీ నీ ఆత్మనౌకను రక్షించుకో!
మెనాస్ : మీరు సర్వప్రపంచాధినేతలు కాదలిచారా?
పాంపే : అంటే నీ అభిప్రాయం?
మెనాస్ : మీరు సర్వప్రపంచ పాలకులు కాదలిచారా? అంటే అప్పటి రాజ్యం ఇప్పటిదానికి ఇంకా రెండింతలు.
పాంపే : అలా జరగటానికి అవకాశం ఎలా కలుగుతుంది?
మెనాస్ : మీకు అటువంటి భావం కలిగితే చాలు. మిగిలినదంతా నాకు వదిలెయ్యండి. నన్ను గురించి 'వీడు అల్పుడన్న భావం మీకుంటే ఉండవచ్చు కానీ నేను సర్వప్రపంచాన్నీ మీకివ్వగల సమర్థుణ్ణి.
పాంపే : చెడత్రాగినట్లున్నావు నీవు.
మెనాస్ : లేదు. పాంపే మహాశయా! లేదు. లేదు. చషకానికి చాలా దూరంగా ఉండిపోయాను. సాహసిస్తే మీరు భూమండలాని కంతటికీ జౌదేవత లౌతారు. మీరు కోరుకొంటే సముద్రవేష్టితమైన సర్వం, లేదా ఆకాశం ఆచ్ఛాదించిన అఖిలం మీదౌతుంది.
పాంపే : ఎలాగో తెలియజెయ్!
మెనాస్ : ప్రపంచ సర్వస్వానికీ భాగస్వాములైన ఈ మువ్వురూ మీ నౌకలో ఉన్నారు. ఓడ త్రాళ్ళను తెగగోస్తాను. సముద్రంమీద అది పయనిస్తూ ఉండగా పైబడి అందరి
ఆంటోని - క్లియోపాత్రా
223