చిత్రించాడు షేక్స్పియర్. చతుర్థాంకంలోని బ్రూటస్ కాషియస్ ల కలహం మానవత్వసముపేతమై మహోదాత్తంగా నడవటానికి కారణం షేక్స్పియర్ ప్రతిభే. సీజర్ కు ప్రథమానుచరుడుగా ఉన్న ఆంటోనీ పాత్రను ప్లూటార్కులో ఉన్న ఆంటోనీ పాత్రకంటే ఉదాత్తంగా సృష్టించి షేక్స్పియర్ వన్నె పెట్టాడు.
లూషియస్ పాత్ర సృష్టి, అతడికి యజమాని ఐన బ్రూటస్ కు మధ్య ఉన్న సంబంధం నాటకకర్త కల్పనే. షేక్స్పియర్ చిత్రించిన కాస్కా పాత్రకు ప్లూటార్క్ లొ ఆధారం లేదు. ద్వితీయాంక ప్రథమదృశ్యంలోని బ్రూటస్ స్వగతం నాటకకర్త ప్రతిభాజన్యం. ప్లేటో తత్త్వాన్ని అనుసరించే బ్రూటస్ సీజర్ ను హత్య చేయటానికి పూనుకొనేటందుకు ఇది ఎంతో తోడ్పడ్డది. ఆర్టిమిడోరస్ కు సీజర్ సమాధానాలు, కాషియస్ తప్ప మిగిలిన విద్రోహ వర్గంలో అందరూ కలిసి సీజర్ ను సభాభవనానికి తీసుకుపోవటానికి ఆయన ఇంటికి కలిసిరావటం, ఇతన్ని గురించిన కాషియస్ సంభాషణం, వధాదృశ్యంలో సీజర్ సంభాషణ, సీజర్ మానసిక శారీరక దౌర్బల్యం, నాలుగో అంకంలో సంగీతాన్ని ప్రవేశపెట్టి సేనాపతుల మధ్య కలిగిన కల్లోలాన్ని కప్పిపుచ్చటం, బ్రూటస్ కాషియస్ ల వీడ్కోలు సంభాషణలు, టిటినియిస్ కాషియస్ ను మాలాలంకృతుణ్ణి చేయటం ఇత్యాది కల్పనలన్నీ షేక్స్పియర్ వే. నాటకీయ ప్రదర్శనా పరిపుష్టికోసం, పాత్రపోషణకోసం షేక్స్పియర్ చేసిన మార్పులవల్లనే “జూలియస్ సీజర్” ఒక అద్భుత దృశ్యకావ్యంగా పరిణమించి, సార్వకాలీనమైన సాహిత్యసృష్టి అయిన దనటంలో ఎటువంటి సందేహం లేదు.
నిర్మాణ విషయంలో ఎట్టి క్లిష్టతా లేకపోవటంలో జూలియస్ సీజర్ విశిష్టమైన నాటకం. ఇది ఏకవస్తుకము ప్రాసంగికాదులు లేవు. ఇందులో సన్నివేశాలు బహుస్వల్పాలు అలాగే పాత్రలూను. ఈ విషయాలల్లో ఇది మేక్బెత్ ను పోలి ఉంది. షేక్స్పియర్ మహాకవి కృతాలైన లియర్, ఆంటోనీ - క్లియోపాత్రాలవంటి విషాదాంత నాటకాలకు ఇది చాలా భిన్నమైంది. లియర్ రాజులో ప్రాసంగిక కథావస్తువు ఉంది ఆంటోనీ క్లియోపాత్రాలో క్లిష్టసన్నివేశ బాహుళ్యం కనిపిస్తున్నది.
నిరంకుశ ప్రభువైన సీజర్ వధవరకూ విద్రోహవర్గానికి తాత్కాలిక విజయమైనా, వారి పతనంతో, రోము పౌరుల స్వాతంత్య్ర వినాశనంతో, రాచరికం పునరుద్ధరింప బడటం చేత అంతంలో దానికి పరాజయం అన్నది జూలియస్ సీజర్ నాటకానికి వస్తువు.
22
వావిలాల సోమయాజులు సాహిత్యం-3