Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భయభ్రాంతుడౌతున్నాడు. అందువల్ల మీ ఇరువురి మధ్యా ఎంతదూరం ఉండటానికి అవకాశం ఉంటే, అంతటిదూరం ఉండేటట్లు చూడు.

ఆంటోనీ : ఇక దీన్నిగురించి విస్తరించి చెప్పకు.

జోస్యుడు : నీకు తప్ప మరెవ్వరికీ చెప్పను. దీన్ని నీకై నీవు చెప్పుకుండేటప్పుడు తప్ప మరెప్పుడూ చెప్పను. అతనితో నీవే క్రీడకు పూనుకొన్నా నీకు అపజయం తప్పదు. సహజంగా అదృష్టం అతనిపక్షాన ఉండటంవల్ల గుణవ్యత్యాసాల ఆధిక్యం అమితమై, నీ పజ్జనే ఉన్నా అతడే నిన్ను గెల్చి తీరుతుంటాడు. నీ తేజం మందగిస్తుంటుంది. నీ ప్రక్కన నిల్చినప్పుడల్లా అతడు విరాజమానుడౌతుంటాడు. తిరిగీ హెచ్చరిస్తున్నాను. నీ సంరక్షకశక్తి అతని వెంట వున్న నిన్ను పాలించటానికి భయపడుతున్నాడు. మీ ఇరువురిమధ్యా దూరం ఉన్నప్పుడు అతడు మళ్ళీ మహోదాత్తంగా వర్తిస్తాడు.

ఆంటోనీ : ఇక నీవు వెళ్ళిపోవచ్చు. నేను అతడితో మాట్లాడదలిచానని వెంటిడియన్కు తెలియజెయ్.

(జోస్యుడు నిష్క్రమిస్తాడు)

అతడు పార్థియాకు వెళ్ళాలి. ఇతడు భావికాలపరిజ్ఞానం వల్ల తెలుసుకొని పలికాడో, లేకపోతే వాక్శుద్ధికలవాడు కావటం వల్ల నోట అనేసింది అయి తీరుతుందో! అయితే ఇతను అన్నది మాత్రం సత్యం. ఆటలో వేసిన నా పాచికల్లా అతడికి అనుకూలంగా తిరిగి తీరుతున్నది. ఎంతటి నా ఎత్తయినా సర్వక్రీడల్లో అతని అదృష్టానికి లొంగిపోతున్నది. పందాలలో అదృష్టం కూడా అతనిదే. సర్వవిధాలా ఆధిక్యం నాదే అయి గోచరించే సమయాలలోనూ, కుక్కుట ద్యూతాలలో అతని పుంజులే తుది విజయాన్ని సాధిస్తున్నవి. వ్యత్యాసాల ఆధిక్యం తమకెంత అనుకూలంగా ఉన్నా, రెంటినీ సమానంగానే కట్లతో బిగించినా, అతని లావుకాలే నా పిట్టలను గెలుస్తున్నాయి. నేను ఈజిప్టుకు వెళ్ళితీరాలి! సీజర్తో సంధికని నేను ఆ ఆక్టేవియాను వివాహమాడాను. అయితే నా ఆనందసర్వస్వం ఆ ఈజిప్టులోనే ఉంది. 45

వెండిడియస్ ప్రవేశిస్తాడు.

స్వాగతం వెంటిడియస్! నీవు పార్థియాకు బయలుదేరాలి. అక్కడ వ్యవహారాల నన్నింటినీ చక్కబెట్టటానికి నీకు అధికారాన్నిచ్చే అవసరమైన పత్రాలను అన్నింటినీ సిద్ధం చేయించాను. నావెంటవచ్చి వాటిని పుచ్చుకో.

(నిష్క్రమిస్తారు)


208

వావిలాల సోమయాజులు సాహిత్యం-3