ఇక నా భార్యను గురించి, ఆమెకున్న శక్తి, ఆమెతో తుల్య అయిన మరొక వనిత ఉండి ఉండవలసిందని నేను భావిస్తున్నాను. రోమకమహాసామ్రాజ్యంలోని తృతీయభాగానికి నీవు అధికారివి. ప్రశాంతంగా ఉండవలసిందని ఆ రాజ్యాన్నంతటినీ అల్పసూచనలతో శాసింపగలవేమోగాని, ఇటువంటి భార్యకు ఎట్టిమార్గాననైనా గుణపాఠం చెప్పలేవు!
ఎనోబార్బస్ : మనందరికీ ఇటువంటి భార్యలుండి సొగసైన యుద్ధాలు జరుగుతుంటే ఎంతో బాగుంటుంది.
ఆంటోనీ : సీజర్ మహాశయా! క్షాంతిరహితమై, శిక్షాతీతమైన ఆమె స్వభావం కల్పించిన కల్లోలాల్లోనూ, అనుసరించిన విధానాలలోనూ చాకచక్యం లేకపోయినా, అవి నీ ప్రశాంతికి భంగాన్ని కల్పించాయని నేనెంతో బాధపడుతూ అంగీకరిస్తాను. అయితే ఆ విషయంలో నేను నిస్సహాయుడనని నీవు అంగీకరించక తప్పదని నే నంటాను.
సీజర్ : అలెగ్జాండ్రియాలో నీవు విలాసాల్లో మునిగి తేలుతున్నప్పుడు, నీకెన్నెన్నో లేఖలు పంపించాను. వాటినన్నింటినీ నీవు చదవనైనా చదవక అలక్ష్యం చేశావు. అంతే కాదు, నా వార్తాహరిని పరిహసించి సమ్ముఖంనుంచి తరిమికొట్టావు.
ఆంటోనీ : మహాశయా! ప్రవేశానికి అనుమతిని పొందకుండానే అతడు సముఖాన నిల్చాడు. అప్పుడే నేను ముగ్గురు రాజులకు విందు చేశాను. ఉదయవేళ నేనుండేటంతటి సమచిత్తంలో లేను. కానీ మరొకనాడు దర్శన మిచ్చినప్పుడు క్రితంనాటి నా స్థితిని క్షమాపణ వేడుకొన్నంతగా వివరించాను. ఈ వార్తాహరిచరిత్ర ఇక నీ నా మధ్య ఆటంకంగా నిలువకుండుగాక! కలహింపవలసిఉంటే ఈ అల్పమానిసి కథ మనకు కారణం కాకుండుగాక!
సీజర్ : నీవు చేసిన ప్రయాణంలోని అంశాన్ని భగ్నం చేశావు. నా యెడ అట్టిదోషం ఉందని నీవనలేవు.
లెపిడస్ : సీజర్ మహాశయా! మృదువుగా సంభాషించు.
ఆంటోనీ : ఆపవద్దు. సీజర్! కానివ్వు. ఆపవద్దు. లెపిడస్, ఆయన్ను స్వేచ్ఛగా మాట్లాడనివ్వు. ఇది పునీతమైన నా గౌరవానికి సంబంధించిన విషయం. అది నాలో లోపించిందని ఆయన భావిస్తున్నాడు. సీజర్! నేను భగ్నంచేశానని నీవు తలపోసిన ఆ ప్రమాణాంశమేదో సెలవియ్యి!
200
వావిలాల సోమయాజులు సాహిత్యం-3