తారట్లాడే తుంగదుబ్బులా ప్రజానీకం ఆటుపోటుల్లో నిరంతరగమనాగమనాలలో కష్టిస్తూ కుమిలి క్రుళ్ళి పోతుంటుంది.
వార్తాహరి : సీజర్ మహాశయా! మరోవార్త. మెనక్రేట్స్2, మెనాస్ అనే సుప్రసిద్ధులైన ఓడదొంగలిద్దరూ సముద్రాలమీద సంపూర్ణాధికారాన్ని వహించి, సమస్తనౌకలనూ చుట్టి ప్రోగేస్తున్నారు. వారు మహాక్రోధంతో ఇటలీ భూభాగం మీదికి దండయాత్రలు సాగిస్తున్నారు. వాటి విషయం తలపులకు వస్తేనే తీరవాసులైన ప్రజలు భయోత్పాతపరికంపితులై పారిపోతున్నారు. వీరోత్సాహంతో యువకులందరూ విప్లవం చేసి వారి కొలువులో నిలవటానికి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి నౌకకైనా సముద్రాలలో తొంగిచూచే సాహసం లేదు. అది వారికంట బడ్డదో పట్టుబడిందన్నమాటే! కొంతగానైనా యుద్ధరంగంలో ఎదుర్కొని ఆపటానికి అవకాశమున్న అతని సైన్యాలకంటే కూడా, అత్యధికంగా ఆ పాంపేనామధేయం జనాన్ని భయకంపితులను కావిస్తున్నది.
సీజర్ : ఆంటోనీ! నీ కామవిలాసోన్మత్తతను ఇక కట్టిపెట్టు! హిర్టియస్, పన్యాలను ఎక్కడ నీవు హతమార్చావో, ఆమోదెనా నుంచి నిన్ను తరిమివేసినప్పుడు నిన్ను వెన్నాడుతూ క్షామం నీ అడుగుజాడల్లో నడిచింది. బహుళభోగివిగా పెరిగినా, సహనంలో ఆటవికులను అతిశయించి, దాన్ని నీవు భరించి జయించావు. అశ్వాలకిచ్చే మద్యాన్ని ఆస్వాదించగలిగావు. వన్యజంతువులు కూడా వాసన చూచి సకిలించి విడిచిపెట్టే పాచిపట్టిన పడియనీరు త్రాగగలిగావు. మొరటుకంచెల మీది కందగడ్డలు తినటానికి నీ నాలుక నిత్యానురాగం వహించింది. మైదానాలు మూడమంచుతో ముంచుకోపోయినప్పటి దుప్పిలా చెట్ల బెరళ్ళు తిని బ్రతకటాన్ని నీవభిలషించావు. ఆల్ప్స్ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, చూచిన మాత్రాన్నే నీ కదనవీరుల్లో కొందరిని మరణించేటట్లు చేసిన జంతువుల విచిత్రామిషాన్ని ఆరగించి బ్రతికావన్నవార్తలు వినిపించాయి. అణుమాత్రమైనా ముఖవికాసపరిపూర్తి సన్నగిల్లని రీతిలో దీన్నంతటినీ నీవు వీరాధివీరుడవై భరించావు. నీ ప్రస్తుతస్థితిని పూర్వస్థితితో పోల్చి నేను చేసే ప్రసంగంవల్ల నిరుపమానమైన నీ ప్రతిష్ఠకెంతో దెబ్బ తగులుతున్నది.
లెపిడస్ : ఆంటోనీ దయనీయుడు.
సీజర్ : అతణ్ణిక లజ్జాభావ మావేశించి ఈజిప్టునుంచి రోముకు త్వరితంగా తరిమివేయుగాక! మనమిర్వురం యుద్ధభూమిలో దర్శనమివ్వవలసిన సమయం వచ్చింది. ఆలస్యం చేయకుండా అందుకోసమని సభ తీరుద్దాం. లేకపోతే మన అలసత్వంవల్ల పాంపే పరంపరాభివృద్ధిని పొందుతాడు.
190
వావిలాల సోమయాజులు సాహిత్యం-3