Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీజర్ : అతని దోషాలను అన్నింటినీ నీవు అత్యుదారదృష్టితో పరికిస్తున్నావు. టోలమీ శయ్య మీద తొట్రుపాట్లు పడటం దోషం కాదందాము. తనకు ఆనందప్రదానం చేసిన ఆ అతివకు రాజ్యదానం" చెయ్యటమూ దోషం కాదందాము. ఒక బానిసతో అర్ధార్ధంగా అసవసేవనం చేయటం, మధ్యాహ్నవేళల్లో రాజవీధుల మైమరచి మద్యంకోసం ఎడ్డెమడ్డి జనాలతో బుజాలు రాచుకుంటూ తిరగటం అతని అంతటివాడికి తగినదేమో చెప్పు? ఇటువంటి అవసతిని కల్పించని అసామాన్య గుణవిశేషాలవల్ల ఏర్పడ్డ అపూర్వవ్యక్తి అతడు. అయినా ఆంటోనీ తనదోషాలను చూచి ఊరుకోరాదు. ఆత్మవిలాస ప్రియత్వం వల్ల మనమీద మహాభారం పడుతున్నది. అటువంటి విలాసవ్యాపారాలతో ఏవో విశ్రాంతివేళలను అతడు గడుపుతున్నట్లయితే వాటి సహజఫలితాలే తగిన శిక్ష వేస్తాయి లెమ్మని నేను సరిపుచ్చుకొనేవాణ్ణి. ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా అతడు చేస్తున్న కాలహరణం అతని స్థితినీ, మనఃస్థితినీ నిరంతరం జ్ఞప్తికి తెస్తూ, విలాసోన్మత్తతను మార్చుకోమని చేసే హెచ్చరికలను లెక్కించకపోవటం వల్ల, వయసునుబట్టి వివేకాన్ని సంపాదించినా తాత్కాలికా నందాలకోసం దాన్ని తరిమికొట్టి తన తార్కికప్రతిభ మీద తిరుగుబాటు చేసే బాలకుడిలాగా ఆంటోనీ నిందాయోగ్యుడౌతున్నాడు.

ఒక వార్తాహరి ప్రవేశిస్తాడు.

లెపిడస్ : ఇంకా కొన్ని వార్తలు వచ్చినట్లున్నాయి.

వార్తాహరి : తమ ఆజ్ఞలను నిర్వర్తించాము. సీజర్ మహోదారా! ఇక ప్రతిఘడియనా దూరాన ఏమి జరుగుతున్నదీ మీకు తెలుస్తుంది. సముద్రం మీద పాంపే బలవత్తరుడైనాడు. ప్రేమతో కాక భయంవల్ల ఇంతవరకూ సీజర్ను బలపరుస్తున్న వారందరూ పాంపేను ప్రేమిస్తున్నారు. అతణ్ణి చేరుకోటంకోసం మీ యెడ ప్రేమలేనివారందరూ నౌకాశ్రయాలకు చేరిపోతున్నారు. పాంపేను గురించి వారిలో వారు ప్రసంగించేటప్పుడు ఆయన చాలా అవమానాలపాలైనాడని చెప్పుకొంటున్నారు.

సీజర్ : ఇదంతా జరుగుతుందని నేను ఎప్పుడో గమనించి ఉండవలసింది. అధికారం వహించే వ్యక్తి దాన్ని ఆర్జించేటంతవరకూ ప్రజాప్రేమకు పాత్రుడై దాన్ని పొంది ఉంటాడనీ, పతనోన్ముఖుడైన వ్యక్తి అతని ప్రేమపాత్రతకంటే బలాన్ని సర్వం కోల్పోయిందాకా ప్రేమింపబడకుండా, అదృశ్యుడైన తరువాత అతిగా ప్రీతిపాత్రుడౌతాడనీ ఎంతో పూర్వంనుంచీ మనం నేర్చుకొంటున్నదే. ప్రవాహమధ్యంలో


ఆంటోని - క్లియోపాత్రా

189