Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీడిస్తున్నది. కానీ, ప్రభూ, నన్ను క్షమించు. నీ నేత్రాలకు నచ్చకపోవటం వల్ల ఈ నాడు నా గుణవిశేషాలే నన్ను చంపేస్తున్నవి. నీ గౌరవసముద్ధరణం నిన్ను ఇంటికాహ్వానిస్తున్నది. అందువల్ల కనికరాన్ని పొందని నా దోషాన్ని గురించి పెడచెవిపెట్టు. సర్వదేవతలూ నీకు తోడ్పడెదరు గాక! మాలికాలంకృతయైన విజయదేవత నీ ఖడ్గాసనాన్ని అధిష్ఠించుగాక! విజయం సుగమమై నీ విమలపాదప్రదేశాన వెదజల్లబడుగాక!!

ఆంటోనీ : అయితే మనమిక నిష్క్రమిద్దాం. పద. ఒకవంక వియోగాన్ని మనం పొందుతున్నా ఒకరికొకరం సన్నిహితులంగానే ఉంటుంటాం విడిపోతుంటాం. నీ ఉనికి ఇక్కడైనా నీవు నాతో అక్కడికి వస్తున్నావు నేను అక్కడికి వెళ్ళిపోతున్నా నీతోనే ఇక్కడ ఉంటున్నాను - ఇక మనం వినోదాలకోసం ఇక్కడినుంచి నిష్క్రమిద్దాం!

(నిష్క్రమిస్తారు)

నాలుగో దృశ్యం

రోమునగరం, సీజర్ గృహం. ఆక్టేవియస్ సీజర్, ఉత్తరాన్ని చదువుతున్న

లెపిడెస్, వారి పరివారాలు ప్రవేశిస్తారు.

సీజర్ : మనతో భాగస్వామి అయిన ఆంటోనీని సీజర్ తన సహజదౌర్బల్యం వల్ల నిందించడం లేదని, లెపిడస్, ఈ ఉత్తరాన్ని తిలకిస్తే నీకర్థమౌతుంది. ఇదిగో అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన లేఖ. అతడు చేపలు పడుతున్నాడు". తప్పత్రాగు తున్నాడు". నిద్రలేకుండా నిండురాత్రులను విలాసాలతో గడిపేస్తున్నాడు. అతడు ఆ క్లియోపాత్రాను మించిన పురుషత్వాన్నిగానీ, ఆ టోలమీరాజ్ఞి అతణ్ణిమించిన స్త్రీత్వాన్నిగానీ ప్రదర్శించటం లేదు. దర్శనమివ్వటం కూడా కష్టంగా ఉంది. రాష్ట్రపాలనలో భాగస్వాములున్నారన్న అంశం అసలే అతడికి మనసులో ఉన్నట్లు తోచదు. అతడు సమస్త మానవదోష సంగ్రహమైనాడు.

లెపిడస్ : అతితీవ్రమైనవైనా ఈ దోషాలు అతని మంచినంతటినీ మటుమాయం చేయగలిగినంతటివి కాజాలవని నా అభిప్రాయం. ఇవి రాత్రివేళల్లో గాఢకాలిమవల్ల అతికాంతిమంతాలుగా కనిపించే నక్షత్రాలవంటివి. ఇవన్నీ అతడు సంపాదించినవి కావు పితరులనుంచి పొందినవి. అతడు వాటికోసమే పుట్టాడు అందువల్ల మార్చుకోలేడు. అయితే ఇవి అతడు కావాలని సంపాదించినవి మాత్రం కావు.


188

వావిలాల సోమయాజులు సాహిత్యం-3