జోస్యుడు : మీ ఇరువురి అదృష్టాలూ తుల్యంగానే ఉన్నాయి.
ఐరాస్ : అది ఎలా సంభవం? వివరాలు సెలవీయండి.
జోస్యుడు : చెప్పాను గదా!
ఐరాస్ : దాని అదృష్టం కంటే నాది అణుమాత్రమైనా అధికంగా లేదా?
ఛార్మియన్ : దురూహలనుంచీ భగవంతుడు మనలను దూరం చేయుడుగాక! ఎలెగ్జాస్! రావేం. అయ్యా! ఈతని అదృష్టం ఎలా ఉందో. ఓ ఇసిస్ దేవతా! ఇతడు లేచిపోని పెళ్ళాన్ని వివాహమాడుగాక! క్రమంగా ఇతడికి ఒకరికంటే ఒకరు కురూపలైన భార్యలు కలుగుదురుగాక! అందరిలోనూ చివరి పెళ్ళాం ఇతణ్ణి చూసి నవ్వుతూ ఇతని శ్మశానం దగ్గిరికి చేరేదాకా ఈ భార్యాపరంపర సాగిపోవుగాక! ఇంతకంటే అతిశయమైన మరో నా అభ్యర్థనాన్ని ప్రసాదించకపోతే పోనీ ఓ ఇసిస్ " దేవతా! దీన్నిమాత్రం త్రోసిపుచ్చకు.
ఐరాస్ : అట్లే అగుగాక! ప్రియదేవీ!! ఈ ప్రజావాంఛను విందువుగాక!
ఛార్మియన్ : దేవీ విందువు గాక!
ఎనోబార్బస్ : ఇక చాలించండి. ఆంటోనీ మహాశయుడు వస్తున్నాడు.
ఛార్మియన్ : వచ్చేది ఆయన కాదు మహారాజ్ఞి!
క్లియోపాత్రా ప్రవేశిస్తుంది.
క్లియోపాత్రా : మీరు నా ప్రభువును చూచారా?
ఎనోబార్బస్ : లేదు రాజ్జీ!
క్లియోపాత్రా : వారు ఇక్కడ లేరా?
ఛార్మియన్ : లేరు మహారాజ్జీ!
క్లియోపాత్రా : ఆయనెప్పుడూ విలాసోన్మత్తుడై ఉంటాడు. అయితే రోమక రాజకీయ వ్యవహారాలు హఠాత్తుగా ఆయన మనస్సును మార్చివేశాయి. ఎనోబార్బస్!
ఎనోబార్బస్ : రాజ్జీ!
క్లియోపాత్రా : ఎక్కడ ఉన్నాడో చూచి ఆయనను ఇక్కడికి తీసుకోరా. ఎలెగ్జాస్ ఎక్కడ?
ఎలెగ్జాస్ : తమ సేవార్థినై నేను ఇక్కడనే వేచి ఉన్నాను. అరుగో, ప్రభువు వస్తున్నారు.
178
వావిలాల సోమయాజులు సాహిత్యం-3