Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

థైరీయసు ముద్దిడుకోటానికని తన మృదుహస్తాన్ని అందించింది. మోసగించనేనా? అది ఆంటోనీ ప్రణయపూర్వకంగా ముద్దిడుకొనే హస్తం. థైరీయస్ క్లియోపాత్రా హస్తాన్ని ముద్దిడుకోటమన్న దృశ్యాన్ని చూచి సహించలేక ఆంటోనీ అతణ్ణి కొరడా దెబ్బలు కొట్టించినప్పుడు, తెలివితక్కువతనం వల్ల తానట్టిపని చేసినట్లు నటించి తన ప్రణయ మచంచలమైందని ప్రకటించి, మానసిక వ్యథ ననుభవిస్తున్న అతడికి తాత్కాలికచిత్తశాంతిని చేకూర్చింది.

తరువాత యుద్ధానికి బయలుదేరేటప్పుడు స్వయంగా కవచధారణ చేయించి పంపించింది. మరుసటియుద్ధంలో కూడా క్లియోపాత్రా పారిపోయిరావటం పిరికితనం వల్లనేగాని, మోసగించను కాదు. ఆంటోనీ తరువాత ఏమి చేస్తాడో అన్న భయంవల్లనే తన సమాధినిర్మాణాన్ని చేరుకొని అందులో దాగుకోటం, మరణించినట్లు అతనికి వార్త పంపించటం జరిపించింది. ఆంటోనీ మరణసమయాన తన ప్రేమసర్వస్వాన్ని ఒక్కుమ్మడిగా కుమ్మరించి పరమానందంతో ప్రాణాలను వీడే అవకాశాన్ని అతడికి కల్పించింది. ప్రాణాలతో పట్టుకోబోయి పరాజిత అయిన తనను ఆక్టేవియస్ రోము పురవీధుల్లో ప్రదర్శించి అవమానిస్తాడని బుద్ధికుశలతవల్ల ఎన్నడో ఈమె కనిపెట్టింది. ఆత్మహత్యా మార్గాన్నే ఈమె అనుసరించి, తన 'ప్రియభర్త'ను చేరుకోటానికి ఈమె చిత్తాన్ని సంసిద్ధం చేసుకొన్నది. పురుగుచే కరిపించుకొని ప్రాణపరిత్యాగం చేసే సమయంలో, ఆమె వెల్లడించిన ఉల్లాసోజ్జ్వలాలైన మధురోహలు రసికలోకానికి ఏ నాటికీ మరుపురానివైనవి. ఈ సమయంలో క్లియోపాత్రా ప్రదర్శించిన ప్రణయప్రవర్తనరీతులు సమస్తదోషాలనూ క్షాళితంచేసి ఆమెచేత రూపొందిన కవితలా వర్తింపజేశాయి.

మరణానంతరమైనా తన సమ్మోహనశక్తిని కోల్పోని ఈ ఈజిప్టురాజ్ఞిని తిలకించి 'తన సౌందర్యమనే సమ్మోహనవిద్యతో మరో ఆంటోనీని నిబద్ధుణ్ణి చేయటానికో అన్నట్లు ఈమె నిద్రపోతున్నది' అన్న ఆక్టేవియస్ అభిప్రాయం, మరణం వల్ల కూడా ఒక మనోహరవిజయాన్ని సాధించిన క్లియోపాత్రాకు కీర్తిగీతికలా ఒప్పుతున్నది.

ఆక్టేవియా

చరిత్రలోని ఆక్టేవియా అపురూపసుందరి. మనోహరమూర్తి. వివేకవతి. నిత్యసత్యప్రియ. పతిభక్తి తత్పర. తనను పరిత్యజించి ఆంటోనీ అలెగ్జాండ్రియాకు వెళ్లిన తరువాత, ఈమె అన్న ఆజ్ఞకు భిన్నంగా ఆంటోనీ ఇంటిలోనే ఒంటిగా ఉంటూ


168

వావిలాల సోమయాజులు సాహిత్యం-3