Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ సందర్భంలో అంటోనీని పిలుచుకొరమ్మని ఛార్మియన్ను తరిమి పంపిస్తూ "తీవ్రాలోచనా నిమగ్నుడై ఉన్నట్లు కన్పిస్తే నేను నృత్యం చేస్తున్నాననీ, వినోదిస్తుంటే హఠాత్తుగా నాకు సుస్తి చేసిందనీ" చెప్పమన్నది.

ఇట్టి ప్రవర్తనతో ఈ రాజ్ఞి ఆంటోనీని సంపూర్ణంగా పోగొట్టుకొంటుందని భయపడ్డ ఛార్మియన్, "ఆయన నిన్ను మనసారా ప్రేమించేటట్లు చేసుకొనే మార్గాన్ని నీవు అనుసరించటం లేదు. సర్వవిషయాలలోనూ ఆయనకు లొంగిపో. ఎందుకూ అభ్యంతరం చెప్పకు” అని సలహా చెప్పింది. ఉదాత్తమానవ హృదయభావ పరిశీలనంలో ప్రౌఢ అయిన ఈ క్లియోపాత్రా, హీనబుద్ధియైన ఛార్మియన్ సూచించిన దాస్యప్రణయాన్ని గురించి "ఆయన్ను కోల్పోవటానికి నీ మార్గం మహా మంచిది” అన్నది.

తరువాత ఒకవంక ఆంటోనీ వస్తుంటే చూడనట్లు నటించి వెళ్ళిపోయింది. అనతికాలానికే కలుసుకొన్నప్పుడు జబ్బువల్ల కసరుబోతైనట్లు నటించ నిశ్చయించింది. ఆంటోనీ ప్రథమ వాక్యమే అతడు ఈజిప్టును విడిచి వెళ్ళిపోవటాన్ని సూచించటంవల్ల.క్లియోపాత్రా తొలుత మూర్ఛను, తర్వాత తెప్పరిల్లటాన్ని అభినయించి అపస్మారకంగానూ వ్యంగ్యంగానూ దూషణమారంభించింది. 'నావలె ఇంతటి మహత్తరమైన మోసానికి పాలైన మహారాజ్ఞి మరొకతె లేనేలే దని తన్ను గూర్చి పలికింది. 'మిథ్యాప్రణయజీవి'వని సంబోధించి ఫుల్వియా మరణవార్తను అతిప్రశాంతంగా భరిస్తున్న కృతఘ్నతకు అతణ్ణి నిందింప నారంభించి, 'ఫుల్వియా మరణవార్తను నీవు గ్రహించే రీతినిబట్టి తెలిసింది. ఇప్పుడు తెలిసింది. నా మరణవార్తను గూడా నీవు ఎలా స్వీకరిస్తావో ఇపుడు తెలిసింది' అన్నది. ఫుల్వియామృతికి అభినయపూర్వకంగానైనా దుఃఖించటం ధర్మమని ప్రార్థించి, అతడినొక మహానటుడవనీ, ప్రణయ పారిశుద్ధ్యం లేని వ్యక్తివనీ ఏమేమో పలికి కోపం తెప్పించింది. అతని కోపం ఆమెకో ఉల్లాసమైంది. చివరకు ఆంటోనీ తప్పక రోముకు వెళ్ళి తీరవలసిన పరిస్థితి ఉందని గమనించటంచేత, మనఃస్థితిని మరుక్షణంలోనే మార్చివేసి సమస్త సౌహార్దాన్నీ ప్రకటించి, ప్రియాలైన వీడ్కోలు వాక్యాలు పలికింది. ఆంటోనీ రోముకు వెళ్ళినతరువాత అతడు లేని ఏకాంతత క్లియోపాత్రా హృదయాన్ని కలవరపెడుతుంటే, అతని చేష్టాదికాన్ని మధురాతిమధురంగా భావిస్తూ పూర్వప్రణయస్మృతులతో కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో అతని దగ్గిరనుంచి వార్త వచ్చింది.

అతడు ఆక్టేవియాను వివాహమాడిన విషయాన్ని విన్నవించేటంత వరకూ మహోల్లాసంతో వింటున్న ఈమె, హఠాత్తుగా కళవళపాటును పొందింది. అట్టి


166

వావిలాల సోమయాజులు సాహిత్యం-3